1st తర్వాత సెకండే ఎందుకు?

Intermediate Board Secretary Syed Umar Jalil Interview with Sakshi

‘ఇంటర్‌’మొదటి ఏడాది తర్వాతే రెండో ఏడాది చేయాల్సిన అవసరం లేకుండా మార్పు

ప్రశాంతమైన చదువుకు... ‘ఫ్లెక్సీ కోర్సు’

విద్యార్థి మరో కోర్సు చేసి వచ్చి,మిగిలిన ఏడాది పూర్తి చేసే అవకాశం

ఈనెల 7న అధ్యయనం కోసం సెంచూరియన్‌ వర్సిటీకి బోర్డు బృందం

‘సాక్షి’తో ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌లో ఫ్లెక్లీ కోర్సు విధానం (మొదటి ఏడాది తరువాతే రెండో ఏడాది కచ్చితంగా చదవాల్సిన అవసరం లేకుండా) అమలుకు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్లాన్‌ చేస్తోంది. ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరువాత కచ్చితంగా రెండో ఏడాది పూర్తి చేయాలి.ఈ నిబంధనను తొలగించే అంశంపై బోర్డు కసరత్తు చేస్తోంది.తొలి ఏడాది ముగిశాక విద్యార్థి మరేదైనా చదువుకొని మళ్లీ ద్వితీయ ఏడాది పూర్తి చేసే అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ విధానం విదేశాల్లో ఉండగా, దేశంలోని ఒడిశాలోని సెంచూరియన్‌ యూనివర్సిటీలో మాత్రమే ఇది అమల్లో ఉంది. దీనివల్ల విద్యార్థులు కొంత కాలవ్యవధితో తమ చదువును కొనసాగించ వచ్చని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఆయన వివిధ అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఒత్తిడి తగ్గించేందుకే..
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాం. గత నెల 30న నిర్వహించిన స్టూడెంట్‌ కౌన్సెలర్ల శిక్షణలో వ్యక్తిత్వ వికాస నిఫుణులు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లలో పాస్, ఫెయిల్‌ స్థానంలో క్లియర్, నాట్‌ క్లియర్‌ పదాలను తీసుకురావడం, ఫ్లెక్సీ విధానం అమలు వంటివి. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.దేశ వ్యాప్తంగా పాస్, ఫెయిల్‌ విధానమే ఉంది. మన రాష్ట్రంలో దానిని తీసుకువస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయా అనే అంశాన్నీ చర్చించాల్సి ఉంది. ఒడిశాలోని సెంచూరియన్‌ యూనివర్సిటీకి ఈనెల 7న అధ్యయనానికి వెళ్తున్నాం. వచ్చాక నివేదికతోపాటు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తాం.

వృత్తి విద్యా కోర్సుల్లో సమూల మార్పులు
రాష్ట్రంలో వృత్తివిద్యను మార్పు చేయబోతున్నాం. ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులను ప్రవేశ పెడతాం.వొకేషనల్‌ ఇంటర్మీడియట్‌ పూర్తి కాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండేలా చూస్తాం. ప్రస్తుతం సెంచూరియన్‌ యూనివర్సిటీలో 28 రకాల వొకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి రాష్ట్రంలో మార్పులు తీసుకువస్తాం.

వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణ..
చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం. ఈ మేరకు జిల్లా అధికారులకు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశాం. రెండు రోజుల్లో ఈ తరగతులు ప్రారంభమవుతాయి. కృతార్థులు కాని విద్యార్థులకూ 
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం.

బోర్డు వెబ్‌సైట్‌లో ఆడియో వీడియో పాఠాలు
విద్యార్థుల కోసం బోర్డు వెబ్‌సైట్‌లో ఆడియో, వీడియో పాఠాలను ఉంచుతాం. ప్రభుత్వ , ప్రైవేటు కాలేజీల విద్యార్థులూ వాటిని చూసి నేర్చుకునేలా ఉంటాయి. ఇంగ్లిషు–తెలుగులో రూపొందించిన ఈ పాఠాలను (పాఠ్యాంశాల వారీగా) నిఫుణుల నుంచి తీసుకుంటున్నాం. త్వరలోనే అందుబాటులోకి తెస్తాం.

ద్వితీయ సంవత్సర పాఠ్య పుస్తకాల మార్పు
గతేడాది ప్రథమ సంవత్సర పాఠ్య పుస్తకాలను మార్పు చేశాం. ఈ ఏడాది ద్వితీయ సంవత్సరంలో మార్చుతున్నాం. వచ్చే ఏడాదినుంచి కొత్త పుస్తకాలు అందుబాటులోకి తెస్తాం. ఈసారి ఆన్‌లైన్‌ మూల్యాంకనం అమలు చేయం.. వచ్చే ఏడాదికి ఆలోచిస్తాం.ఇకపై పక్కాగా నిబంధనల ప్రకారం ఉన్న కళాశాలలకే అనుమతులు ఇస్తాం. ఈ ప్రక్రియనూ జనవరిలోనే ప్రారంభిస్తాం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top