
ఏటూరునాగారం: తండ్రి మద్యానికి బానిసై నిత్యం తల్లితో గొడవపడుతుండడంతో మనోవేదనకు గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం రాంనగర్‌లో గురువారం రాత్రి జరిగింది. రాంనగర్‌కు చెందిన గారె నారాయణ, వెంకటమ్మల కుమార్తె సులోమిని(17) ములుగులో ఇంటర్ చదువుతోంది. ఆమె బతుకమ్మ సెలవులకు ఇంటికి వచ్చింది.
గురువారం సాయంత్రం తండ్రి తాగొచ్చి తల్లి వెంకటమ్మతో గొడవ పడు తుండగా సులోమిని అడ్డగించి నచ్చజెప్పింది. అయినప్పటికీ వినకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ‘నాన్నా.. నేను చనిపోతేనైనా నువ్వు తాగుడు మానేస్తావా ?’ అని ప్రశ్నించింది. అయినా, గొడవ మానకపోవడంతో మనస్తాపానికి గురై అదే రోజు రాత్రి పురుగుల మందు తాగింది. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది.