ఇంటర్‌ ప్రశ్నపత్రాల పెట్టెలు మాయం 

Inter-question paper boxes was missed - Sakshi

వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో గల్లంతు  

విద్యారణ్యపురి: వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో భద్రపర్చిన ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రాలకు సంబంధించిన రెండు పెట్టెలు మాయమయ్యాయి. బుధవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 7 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన చీఫ్‌ సూపరింటెండెంట్, కస్టోడియన్‌లకు ప్రశ్నపత్రాలను భద్రపర్చిన రెండు పెట్టెలు మాయమైన విషయం తెలిసింది. ఈ ఏడాది మార్చిలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరిగాయి. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 23న రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రానికి చెందిన విద్యార్థుల కోసం ఇంటర్‌ బోర్డు నుంచి వచ్చిన మూడు సెట్ల ప్రశ్నపత్రాలను 13 పెట్టెల్లో మిల్స్‌కాలనీ పోలీస్టేషన్‌లో బోర్డు అధికారులు భద్రపర్చారు. ఆ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో ఒక్కో సెట్‌ను మాత్రమే ఉపయోగించారు. మిగతా రెండు సెట్ల ప్రశ్నపత్రాలను అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు వినియోగించడం కోసం పెట్టెల్లో అలాగే భద్రపరిచారు.

ఈనెల 7 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ రజిత, కస్టోడియన్‌లు పోలీస్టేషన్‌కు వెళ్లి పరిశీలించగా ప్రశ్నపత్రాలు కలిగిన 13 పెట్టెలలో రెండు పెట్టెలు కనిపించలేదు. దీంతో వారు ఇంటర్‌ విద్య డీఐఈఓ ఎం.లింగయ్య దృష్టికి తీసుకెళ్లారు. కాగా, హైదరాబాద్‌లోని బోర్డు నుంచి కూడా పలువురు అధికారులు ఈనెల 4న వచ్చి పోలీస్టేషన్‌లో పరిశీలించినట్లు సమాచారం. బుధవారం కళాశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ రజిత వచ్చి మరోసారి పరిశీలించారు. రెండు పెట్టెలు తక్కువగా ఉండడంతో పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రశ్నపత్రాల పెట్టెల గల్లంతుపై విచారణాధికారిగా ఏసీపీ నర్సయ్యను నియమించినట్లు డీసీపీ నర్సింహ తెలిపారు. ఇదిలా ఉండగా ఒకే గదిలో ఇంటర్, టెన్త్‌ పరీక్షల ప్రశ్నపత్రాలను పెట్టెల్లో భద్రపరిచారని, అందులో టెన్త్‌ పరీక్షల ప్రశ్నపత్రాల ఖాళీ పెట్టెలను సంబంధిత అధికారులు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొరపాటున ఇంటర్‌కు సంబంధించిన పెట్టెలు కూడా వారు తీసుకెళ్లారా అనేది తేలాల్సి ఉందని అంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top