ఎన్‌సీఈఆర్‌టీ స్థాయిలో పాఠ్య ప్రణాళిక
మే మొదటి వారంలో కొత్త పుస్తకాలు
ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్.. నచ్చిన ల్యాబ్‌ను విద్యార్థులు ఎంచుకొనే వీలు
అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్‌తో కొత్త కోర్సు
ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ విద్యలో గుణాత్మక మార్పులు తెస్తున్నట్లు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రెండు సంవత్సరాల సిలబస్‌ను పూర్తిగా మారుస్తున్నా మని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) స్థాయిలో పాఠ్య ప్రణాళిక ఉండబోతోందన్నారు. ఇంటర్ బోర్డు అధికారులతో కలిసి ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కొన్ని సబ్జెక్టులను ఆరేళ్ల క్రితం, మరికొన్నింటిని 12 ఏళ్ల క్రితం మార్చారని.. ఇప్పుడు సమూలంగా మారుస్తున్నామని చెప్పారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడంతో ఇప్పటికే సబ్జెక్టు కమిటీని వేశామని వివరించారు. ఏయే చాప్టర్లలో ఏ మార్పులు తేవాలనేది కమిటీ సూచిస్తుందని, వచ్చే 45 రోజుల్లో కొత్త సిలబస్‌ను ఖరారు చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఏప్రిల్ ఆఖరు లేదా మే తొలివారంలోనే కొత్త సిలబస్‌తో కూడిన పుస్తకాల ముద్రణ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.
నైపుణ్యం పెంపే లక్ష్యం: కొత్త సిలబస్ పూర్తిగా ప్రస్తుత అవసరాలకు, విద్యార్థుల నైపుణ్యాలు పెంచేదిగా ఉంటుందని కృష్ణ ఆదిత్య చెప్పారు. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఇతర భాషలను కూడా పరిపూర్ణంగా నేర్చుకునేలా బోధన కార్యాచరణను ఖరారు చేస్తున్నామన్నారు. ఉదాహరణకు చరిత్ర సబ్జెక్టు తీసుకున్న విద్యార్థి స్థానిక పరిస్థితులు, చరిత్ర నేర్చుకునేలా చేస్తామని.. కామర్స్‌లో బడ్జెట్ రూపకల్పన, స్వరూపంపై అవగాహన కల్పిస్తామని వివరించారు. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ నైపుణ్యం పెంచే పాఠ్యాంశాలు ఉంటాయన్నారు. ప్రతి చాప్టర్‌కూ క్యూఆర్ కోడ్ ఉంటుందని... దీన్ని స్కాన్ చేస్తే పాఠం మొత్తం లభించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాన్–డిటేయిల్డ్ కూడా తీసుకురావాలని భావిస్తున్నామన్నారు.
ప్రయోగాలపై కొత్త పంథా
ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్‌కే పరిమితమైన ప్రాక్టికల్స్‌ను ఫస్టియర్‌లోనూ నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణ ఆదిత్య చెప్పారు. ప్రయోగాత్మకంగా నేర్చుకోవాలన్నదే దీని ఉద్దేశమన్నారు. 80 శాతం థియరీ మార్కులు ఉంటే 20 శాతం మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉంటాయని వివరించారు. ప్రయోగశాలలు ఎక్కడ బాగుంటే అక్కడకు వెళ్లి విద్యార్థులు నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నామని.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో సంబంధం లేకుండా ఆన్‌లైన్ ద్వారా విద్యార్థి లే»ొరేటరీని ఎంపిక చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఇంటర్... ఇలా ఏ కాలేజీలోనైనా ప్రాక్టికల్స్‌కు హాజరయ్యేలా సింగిల్ పోర్టల్‌ను తీసుకొస్తున్నామన్నారు. ఎంఈసీలో స్కేలింగ్ విధానం ద్వారా మరింత మెరుగైన కోర్సును రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అకౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్‌తో కూడిన కొత్త కోర్సును అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు మొదలు పెట్టామని కృష్ణ ఆదిత్య తెలిపారు. మే 25 నుంచి మార్చి 15 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే షెడ్యూల్‌ను విడుదల చేస్తామని చెప్పారు. విద్యార్థులు నవంబర్ తొలివారంలో పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.


