ఇంటర్ బోర్డు నిర్ణయంపై గురుకుల కాలేజీల అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ప్రయోగ పరీక్షా కేంద్రాల ఖరారు విషయంలో బోర్డు తీసుకున్న నిర్ణయంపై గురుకుల విద్యాసంస్థల అధ్యాప కులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురుకుల జూనియర్ కాలేజీల్లోని ఇంటర్ సెకండియర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ కోసం సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు హాజరు కావాలని పేర్కొనడంపై వారు పెదవివిరుస్తు న్నారు.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక కాలేజీలైన గురుకుల విద్యాసంస్థలను ప్రయోగ పరీక్షా కేంద్రాలకు అనుమతించకపోవడం గురుకు లాల పరపతిని దిగజార్చడమేనని విమర్శిస్తు న్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెల్ఫ్ సెంటర్లు ఉంటుండగా గురుకులాల్లో మెరుగైన మౌలిక వసతులు ఉన్నప్పటికీ ప్రయోగ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయ ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే గురుకులాల్లో రెసిడెన్షియల్ విధానంలో బోధన జరుగుతుందని.. ప్రయోగ పరీక్షల కోసం విద్యార్థులు గురుకులాలను వదిలి ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండే ప్రాంతాల వరకు రాకపోకలు సాగించాల్సి రానుండటం వారికి ఇబ్బందిగా మారుతుందని అధ్యాపకులు అంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.


