‘ఫస్టియర్‌’ ప్రశాంతం

Inter first year exams compleat first day peacefully - Sakshi

గ్రేటర్‌లో తొలి రోజు 5101 మంది గైర్హాజరు

సికింద్రాబాద్‌లో మొరాయించిన ఆర్టీసీ బస్సు

పోలీసు వాహనంలో విద్యార్థుల తరలింపు

చివరి నిమిషంలో విద్యార్థుల ఉరుకులు పరుగులు

షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు

ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్‌ విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రేటర్‌లో మొదటి పరీక్షలకు 5101 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు మొరాయించడంతో...అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు కాస్త ఇబ్బందిపడ్డారు. చాలా మంది వారికి లిఫ్ట్‌ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. పోలీసు వాహనంలో కొందరిని పరీక్ష కేంద్రాలకు తరలించారు. ఇక ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు షెడ్యూలు ప్రకారం మార్చి 2 వతేదీ నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్మీడియెట్‌ బోర్డు మరోసారి స్పష్టం చేసింది. 

సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదని ఇంటర్మీడియట్‌ బోర్డు మరోసారి స్పష్టం చేసింది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే (మార్చి 2న సెకండ్‌ ఇయర్‌) పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు నిర్థేశిత సమయానికి గంట ముందే ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. ఆలస్యంగా వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొంది. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హైదాబాద్‌ జిల్లాలో 79574 మంది విద్యార్థులకు 77258 మంది హాజరుకాగా, 2316 మంది గైర్హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 5803 మందికి 56538 మంది హాజరయ్యారు. 1515 మంది గైర్హజరయ్యారు. మేడ్చల్‌జిల్లాలో 60876 మందికి 59606 మంది పరీక్ష రాయగా, 1270 మంది గైర్హ జరైనట్లు ఆయా జిల్లాల ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ప్రకటించారు. నిమిషం ఆలస్యం నిబంధనలో కొంత సడలింపు ఇచ్చారు. నాలుగైదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను కూడా లోనికి అనుమతించారు. తొలితప్పిదంగా భావించి వారిని హెచ్చరించారు. మాల్‌ప్రాక్టీస్, మాస్‌కాఫియింగ్‌ వంటి ఎలాంటి కేసులు నమోదు కాలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో ఆయా సెంటర్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో విద్యార్థులు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. 

మొరాయించిన ఆర్టీసీ బస్సు...పోలీసు వాహనంలో తరలింపు
మారేడుపల్లి: ఇంటర్‌ పరీక్షలు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. పరీక్ష సెంటర్‌కు బయలుదేరే ముందే ఆర్టీసీ బస్సు మొరాయించడంతో విద్యార్థులు కంగారుపడ్డారు. చివరకు ఆ దారిలో వెళ్లే వాహనదారులను లిఫ్ట్‌ అడిగి కొందరు బయలుదేరగా...మరికొంత మందిని మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు తన వాహనంలో ఎక్కించుకుని స్వయంగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ మాగ్నెట్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ మహిళా కళాశాలలో 78 మంది విద్యార్ధులు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు.  వీరికి మారేడుపల్లిలోని బాలికల జూనియర్‌ కళాశాలలో పరీక్ష సెంటర్‌ కేటాయించారు. ఉదయం 7:30 గంటలకు రాణీగంజ్‌–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విద్యార్థులను తరలించేందుకు హాస్టల్‌కు చేరుకుంది. 7:45 గంటల ప్రాంతంలో విద్యార్థులు బస్సులో వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. తీరా బయలుదేరే ముందు బస్సు మొరాయించింది. దీంతో  విద్యార్థులు ఆందోళనకు గురై కన్నీటిపర్యంతమయ్యారు. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు ఆ దారిగుండా వచ్చే ఆటోలను ఆపి విద్యార్థులను పరీక్షహాల్‌కు తరలించారు. కొందర్ని తన వాహనంలో పరీక్ష సెంటర్‌కు తీసుకువెళ్ళారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top