హైదరాబాద్‌లో ఇంటెల్‌ టెక్‌ సెంటర్‌

Intel Tech Center in Hyderabad - Sakshi

కంపెనీ విస్తరణకు నగరాన్ని ఎంచుకున్న ఇంటెల్‌

మంత్రి కేటీఆర్‌తో ఇంటెల్‌ ఇండియా హెడ్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్‌ హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలో కంపెనీ విస్తరణ కార్యకలాపాలకు సంస్థ నగరాన్ని ఎంపిక చేసుకుంది. టెక్నాలజీ సెంటర్‌ కోసం ఇంటెల్‌ 1,500 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులను నియమించుకోనుంది. భవిష్యత్‌లో ఉద్యోగుల సంఖ్య 5 వేల వరకు పెరిగే అవకాశముంది. ఇంటెల్‌ ఇండియా అధిపతి నివృత్తి రాయ్‌ శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశమై టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుపై చర్చలు జరిపారు.

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల తయారీకి ఉన్న అనుకూల పరిస్థితులపై చర్చించారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా భారత్‌లో ఇంటెల్‌ విస్తరణకు అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధి బృందం తెలియజేసింది. నగరానికి ఇంటెల్‌ రావడంతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్‌ పరిశ్రమల అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడతాయన్నారు.  తమ కార్యకలాపాల కోసం నగరాన్ని ఎంచుకోవడం పట్ల ఇంటెల్‌ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో ఉన్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్‌ పరికరాల తయారీకి అవసరమైన అనుబంధ పరిశ్రమల తయారీ సామర్థ్యం, అందుబాటులో ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా ఇంటెల్‌ కంపెనీ బృందం చర్చించింది.  

త్వరలో ఇంటెల్‌ గ్లోబల్‌ సీఈఓతో కేటీఆర్‌ భేటీ..  
ఈ ప్రాజెక్టు విషయమై త్వరలో ఇంటెల్‌ గ్లోబల్‌ సీఈఓతో మంత్రి కేటీఆర్‌ సమావేశమై చర్చలు జరుపుతారని ఆయన కార్యాలయం తెలిపింది. ఈ నెల 15న బెంగళూరులోని ఇంటెల్‌ ప్రాంగణంలో జరిగే సంస్థ 20వ వార్షికోత్సవ సంబరాలకు హాజరు కావాల్సిందిగా  కేటీఆర్‌ను ఇంటెల్‌ ఇండియా అధిపతి నివృత్తి రాయ్‌ ఆహ్వానించా రు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్, టీ–వర్క్స్, రాష్ట్రం లోని ఇతర స్టార్టప్‌ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఇంటెల్‌ కంపెనీ సుముఖంగా ఉందని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top