ఏదీ బీమా ధీమా?

Insurance Companies Cheating to People - Sakshi

నియంత్రణలో ఆర్టీఏ నిర్లక్ష్యం

ప్రమాద బాధితుల బీమాపై నీలినీడలు

కేంద్ర రహదారి భద్రతా బిలుల్లో పలు అంశాల ప్రస్తావన

సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు బీమా సంస్థలు, వాహన యజమానులు పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదన పరిహాసానికి తావిస్తోంది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రహదారి భద్రతా బిల్లులో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించే లక్ష్యంతో వాహన బీమాపై దృష్టి కేంద్రీకరించారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ప్రమాదానికి పాల్పడిన వాహన యజమానులు, బీమా సంస్థలే  మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలకు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ  క్షేత్రస్థాయిలో  ప్రమాదబీమాపై ఇప్పటికే నీలినీడలు అలుముకొని ఉన్నాయి. గ్రేటర్‌లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న నకిలీబీమా సర్టిఫికెట్‌ల  దందా రహదారి భద్రతకు  తూట్లు పొడుస్తోంది. ఆటోలు, కాబ్‌లు, మెటడోర్‌లు, టాటాఏస్‌లు, మినీ బస్సులు, డీసీఎంలు, వ్యాన్‌లు, లారీలు, ప్రైవేట్‌ బస్సులు, స్కూల్‌ బస్సులు, తదితర  అన్ని  ప్రజారవాణా, సరుకు రవాణా వాహనాలకు ప్రతి సంవత్సరం నిర్వహించే ఫిట్‌నెస్‌ పరీక్షల్లో  నకిలీ బీమా సర్టిఫికెట్లే  రాజ్యమేలుతున్నాయి. వాహనాల ఫిట్‌నెస్‌ సమయంలో వాటి యజమానులు, ట్రావెల్స్‌ సంస్థలు, ఏజెంట్‌లు సమర్పించే బీమా సర్టిఫికెట్‌లు  కేవలం నకిలీవని, ఏ ప్రామాణికమైన బీమాసంస్థకు చెందినవి కావని తెలిసి కూడా ఆర్టీఏ అధికారులు యధేచ్చగా  ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లు ఇచ్చేస్తున్నారు. ఇలా నకిలీ బీమా పత్రాల ఆధారంగా ఫిట్‌నెస్‌పై ధృవీకరణ   పొందే వాహనాలు  ప్రమాదాలకు పాల్పడితే  బాధితులకు ఎలాంటి పరిహారం లభించే  అవకాశం ఉండదు. సదరు వాహనం ఏ బీమా సంస్థకు ప్రీమియం చెల్లించకుండానే తిరుగుతున్న దృష్ట్యా ప్రమాద బీమా వర్తించదు. నగరంలోని అన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో నకిలీ బీమా దందా యధేచ్చగా కొనసాగుతున్నప్పటికీ ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాహన యజమానులు, దళారులు కుమ్ముక్కై సాగిస్తున్న ఈ  అక్రమ దందాకు ఊతమిచ్చేవిధంగా ఈ నిర్లక్ష్యం  కొనసాగుతోంది.

క్యూఆర్‌ సృష్టించేస్తారు...
వ్యక్తిగత వాహనాల బీమా  విషయంలో వాహనదారులు నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం వారికే పరిమితమవుతుంది. అయినప్పటికీ కొత్త వాహనాల కొనుగోలు సమయంలోనే బీమా సంస్థలు కార్లు, బైక్‌లు, తదితర వ్యక్తిగత వాహనాలకు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు వర్తించే విధంగా ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని తీసుకొని బీమా ధృవపత్రాలను అందజేస్తున్నాయి. కానీ రవాణా వాహనాలకు ఇది సాధ్యం కాదు. ఈ వాహనాలు ప్రతి సంవత్సరం ఆర్టీఏ నుంచి సామర్ధ్య ధృవీకరణను పొందాల్సి ఉంటుంది. ఆ సమయంలో బీమా సర్టిఫికెట్‌  తప్పనిసరి. కానీ  ప్రయాణికుల సీట్ల సామరŠాధ్యన్ని అనుసరించి ఒక్కో వాహనం రూ.5000 నుంచి  రూ.15000 వరకు ప్రీమియం చెల్లించి అధీకృత బీమా సంస్థల నుంచి  సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఈ  ప్రీమియం మొత్తాన్ని ఎగవేసేందుకే వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్ల సహకారంతో మార్కెట్‌లో కేవలం రూ.500 నుంచి రూ.1000లకు ఒకటి చొప్పున లభించే నకిలీ బీమా పత్రాలను సమర్పిస్తున్నారు. ఈ  పత్రాలను తయారు చేసే క్రమంలో సదరు వ్యక్తులు క్విక్‌ రెస్పాన్స్‌ (క్యూఆర్‌) కోడ్‌ను కూడా కంఫ్యూటర్‌ ఆధారంగా సృష్టిస్తున్నారు. రకరకాల పేర్లతో రూపొందించే ఈ పత్రాలు పూర్తిగా నకిలీవేనని తెలిసినప్పటికీ ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏజెంట్‌ల ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును గుడ్డిగా ఆమోదిస్తూ రహదారి భద్రతను పాతరేస్తున్నారు. తమకు కనిపించే బీమా పత్రాలు నకిలీవేనని తెలిసినప్పటికీ తప్పుడు క్యూఆర్‌ కోడ్‌ను పరిగణనలోకి తీసుకొని వదిలేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో తరచుగా ఇలాంటి నకిలీలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ  ఉన్నతాధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో  ప్రస్తుతం అన్ని రకాల  వాహనాలు సుమారు  55 లక్షల వరకు ఉన్నాయి.  సుమారు 35 లక్షల ద్విచక్ర వాహనాలు,మరో  15 లక్షల  కార్లు  వ్యక్తిగత కేటగిరీకి చెందినవి కాగా, మరో  5 లక్షల వాహనాలు పూర్తిగా రవాణా కేటగిరీకి చెందినవి. వీటికి ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్‌ తప్పనిసరి.  లక్షా 50 వేల ఆటోలు, సెవెన్‌ సీటర్‌ ఆటోలు, మరో 2 లక్షల  లారీలు, ఇవి కాకుండా ప్రైవేట్‌ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్‌ బస్సులు, వ్యాన్‌లు, తదితర అన్ని కేటగిరీలకు చెందిన ప్రజా రవాణా, సరుకు రవాణా వాహనాలలో  60 శాతానికి పైగా నకిలీ బీమా పత్రాల ఆధారంగానే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌లు తీసుకుంటున్నట్లు  ఆరోపణలున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top