కాలు లేదని కుంగిపోలే..

Inspired Story Of Auto Driver Who Lost His Leg In Accident In Khammam - Sakshi

సాక్షి, పాల్వంచ : శరీర అవయవాలన్నీ బాగున్నా..పనికి ఒళ్లొంచాలంటే సాకులు చెప్పేవారు ఇతడిని చూస్తే తమ తీరు మార్చుకుంటారు. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామానికి చెందిన బోగి ఉపేందర్‌ ఓ రోడ్డు ప్రమాదంలో తన కాలును కోల్పోగా..అంతే కుంగిపోతూ ఉండకుండా కోలుకుని ధైర్యంగా జీవిస్తున్నాడు. వంటి కాలుతో ఆటోనడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలుకు చేరుస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో ఇతను పాల వ్యాపారం చేసేవాడు.

2010 మార్చి28న పాల్వంచలో పాలుపోసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లక్ష్మీదేవిపల్లిలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో భద్రాచలం జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడి కుడి కాలు నుజ్జునుజ్జవడంతో వైద్యులు మోకాలి వరకు తొలగించారు. కోలుకున్నాక..బాగా దిగాలు చెందాడు. అయితే..తనే ఆలోచించి ఇలా ఖాళీగా ఉండొద్దని భావించి ఆటో నడపాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో క్లచ్‌ ఉండడంతో డ్రైవింగ్‌ ఇబ్బందిగా మారలేదు. ఎవరి సహాయం తీసుకోకుండానే ప్రతిరోజూ అన్ని పనులూ తానే చేసుకుంటూ..ఆటో నడుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లి..సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాడు. భద్రంగా డ్రైవింగ్‌ చేస్తానని, అతివేగంగా అస్సలే వెళ్లనని, ఆటోలో కూర్చున్న వారిని సురక్షితంగా చేరవేస్తానని అంటున్నాడు. భార్య సౌజన్య, ముగ్గురు పిల్లలను ప్రేమగా చూసుకుంటానని, వారే తన బలమని ఎంతో ఆనందంగా చెబుతున్నాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top