
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో దేవాలయ ఉద్యోగులు, అర్చకులకు వేతనాలు చెల్లించే కొత్త విధానానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఉద్యోగ, అర్చక సంఘాల ప్రతినిధులకు చెక్కులు అందించి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిసెంబర్ నుంచే సెక్షన్ 65ఏ ప్రకారం వేతనాలు చెల్లించనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖకు రూ.37.5 కోట్లు విడుదల చేసింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొత్త విధానం అమలుకు వీలుగా చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే.
ఇంతకాలం దేవాలయాల ఆదాయం నుంచి ఆలయ కార్యనిర్వహణాధికారులు వేతనాలు చెల్లించారు. ఇకమీదట ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేతన నిధి నుంచి వేతనాలు చెల్లిస్తారు. అర్చకులు, ఉద్యోగుల ఖాతాలకు ఆ మొత్తాన్ని జమ చేస్తారు. దేవాలయ ఆదాయం సరిపోనందున ప్రతినెలా తక్కువ పడే మొత్తాన్ని ప్రభుత్వమే గ్రాంటుగా చెల్లిస్తుంది. దీనిపై దేవాలయ ఉద్యోగ, అర్చక సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వేతనాలను ధార్మిక పరిషత్ నుంచే చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పరిషత్ ఏర్పాటు కాకపోవటం విశేషం.