వేసవి.. జాగ్రత్త సుమా

Increase In Burglars Attacks During Summer - Sakshi

సాక్షి, మిర్యాలగూడ అర్బన్‌ : వేసవి కాలం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చాయి కదా అని ఇంటికి తాళం వేసి ఊర్లకెలుతున్నారా..? అయితే మీ విలువైన వస్తువులు జాగ్రత్త.. దొంగలు వాటిని మాయం చేయొచ్చు. రాత్రి సమయంలో ఉక్కపోతను భరించలేకుండా మేడపైన పడుకుంటున్నారా..? అయితే మీ ఇంటి తాళం తీసి దొంగలు తెల్లవారే సరికి మీ విలువైన సొత్తును అపహరిం చొచ్చు. వేసవి కాలం దొంగతనాలకు అనువైన సమయం అని పోలీసులు పేర్కొంటున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలను నివారించవచ్చని వారు అంటున్నారు. రాత్రి సమయంలో గస్తీలు పెంచినా ప్రజలు అప్రమత్తంగా లేనిదే దొంగతనాలకు చెక్‌పెట్టడం సాధ్యం కాదంటున్నారు పోలీసులు. 

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌..
తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతూ విలువైన సొత్తును మాయం చేస్తున్నారు. ముందుగా కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇండ్లను గుర్తించి చోరీ లకు పక్కా స్కెచ్‌ వేస్తారు. రాత్రి సమయంలో ఇంటితాళం పగులగొట్టి ఇంట్లోని విలువైన సొమ్మును చోరీ చేస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ఊర్లకు వేళ్లే వారు విలువైన వస్తువులు బంగారం, వెండి, డబ్బులను ఇంట్లో పెట్టుకోక పోవడమే మంచిది. వాటిని బ్యాంకుల్లో ఉంచితే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులకు సమాచారం ఇవ్వాలి..
ఇంటికి తాళం వేసి ఊరికెళ్లే పరిస్థితుల్లో దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందిస్తే రాత్రి సమయంలో పోలీసులు ఆ కాలనీల్లో గస్తీని పెంచుతారు. కానీ ప్రజలు ఈ విషయాలను పట్టించుకోకుండా వెళుతుండటంతో తమ విలువైన సొత్తును పోగొట్టుకుంటున్నారు. ప్రజల్లో స్పందన ఉంటేనే దొంగతనాలనునివారించే అవకాశం ఉంటుందని పోలీసులు అంటున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇచ్చే సమయంలో ఇంటినంబర్, కాలనీ పేరు, యజమాని ఫోన్‌నంబర్‌తోపాటు  లాండ్‌మార్కు వివరాలను పోలీసులకు అందిస్తే గస్తీని పెంచి నిఘా పెడతారు. పోలీసులు రాత్రి సమయంలో గస్తీ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కూడా తమ బాధ్యతగా భావించి పోలీసులకు సహకరిస్తే దొంగతనాలను నివారించే వీలుందని వారు పేర్కొంటున్నారు. 

కనీస జాగ్రత్తలు పాటించాలి..
వేసవిలో ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో వాతావరణం వేడెక్కి రాత్రి సమయంలో ఉక్కపోత భరించలేనంతగా ఉంటుంది. ఇంట్లో నిద్రించేందుకు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. దీంతో ఎక్కువగా ఇంటి ఆవరణలో, మేడపైన నిద్రించేందుకు ఇష్టపడతారు. ఇలాంటి రోజుల్లో కనీస జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచి స్తున్నారు. సొత్తు మాయమైన తర్వాత బాధపడే కంటే ముందు.జాగ్రత్తలు పాటించి తమ విలువైన సొమ్మును భద్రపర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇంటికి వేసే తాళాలు సైతం మార్కెట్లో బ్రాండెడ్‌ దొరుకుతున్నాయి. తాళం టచ్‌ చేస్తే అ లారం మోగే తాళాలు అందుబాటులోకి వచ్చా యి. ఇలాంటి వాటిని వాడితే కొంత మేరకు దొం గతనాలను అరికట్టవచ్చని వారు సూచిస్తున్నారు. 

సీసీ కెమెరాల ఏర్పాటు ముఖ్యమే..
లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంటిని నిర్మించుకుంటున్న ప్రజలు కేవలం తక్కువ ఖర్చు అయ్యే సీసీ కెమరాల ఏర్పాటుపై శ్రద్ధ చూపడం లేదు. కాలనీ కమిటీలు ఏర్పడి సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకుంటే కాలనీలో సంచరించే కొత్త వ్యక్తుల గురించిన వివరాలు అందులో నమోదయ్యే అవకాశం  ఉంటుంది. అనుమానం వచ్చిన వ్యక్తులను గుర్తించే వీలు కలుగుతుంది. ఇంటి పరిసరాల్లో సైతం సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలకు చెక్‌ పెట్టవచ్చు.  దొంతనాలు జరిగిన వెంటనే సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులను గుర్తించి సొత్తును రికవరీ చేసే అవకాశముంటుదని పోలీసులు పేర్కొంటున్నారు.  

ప్రజలు సహకరించాలి
వేసవిలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దొంగతనాలను అరికట్టడంలో పోలీసు శాఖ ఎంతగా శ్రమిస్తుందో ప్రజలు తమ బాధ్యతగా సహకరించాలి. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. కొద్ది పాటి జాగ్రత్తలు పాటించి మీ విలువైన వస్తువులు చోరీకి గురి కాకుండా చూసుకోవాలి. ఇప్పటికే రాత్రి సమయంలో కాలనీల్లో పోలీసు గస్తీలను ముమ్మరం చేశాం. 

– పి.శ్రీనివాస్, డీఎస్పీ మిర్యాలగూడ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top