వనస్థలిపురంలో కరోనా మృతి కలకలం

Hyderabad: Six in a Family at Vanasthalipuram Test Positive for Coronavirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసుల మూలాల చిక్కుముడి వీడటం లేదు. ఎన్నారై.. మర్కజ్‌ లింకులతో సంబంధం లేనివారు.. నిత్యావసర సరుకులు విక్రయించే చిరు వ్యాపారులు కూడా కరోనా వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడం, అందులో ఒకరు మృతిచెందడంతో స్థానికంగా కలకలం రేగింది. దీంతో అధికారులు కరోనా వచ్చిన ఇంటి పరసరాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించి ఆ ప్రాంతంలో ఎవరూ సంచరించకుండా బారికేడ్లు ఏర్పాటు చేయించారు.

వివరాలలోకి వెళితే... గడ్డిఅన్నారం డివిజన్‌ శారదానగర్‌కు చెందిన వ్యక్తి(50) మలక్‌పేట గంజిలో నూనె వ్యాపారం చేస్తున్నాడు. జ్వరంతో బాధపడుతూ వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో నివాసం ఉండే సోదరుడు ఇంటికి వచ్చి అతడి సహాయంతో స్థానికంగా ఉన్న జీవన్‌సాయి ఆసుపత్రిలో ఈ నెల 22 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు చికిత్స పొందాడు. అయితే అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించి, అతడి సోదరుడి కుటుంబ సభ్యులను ఇంటిలోనే క్వారంటైన్‌ చేశారు. ఈ క్రమంలో అతడి సోదరుడి తండ్రి(70)కి కూడా కోవిడ్‌ సోకింది. అప్పటికే షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వృద్ధుడిని మంగళవారం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మొదట కరోనా పాజిటివ్‌గా తేలిన నూనె వ్యాపారి నుంచి అతడి భార్యకు, సోదరుడికి, సోదరుడి భార్య, ఇద్దరు కూతుళ్లకూ వైరస్‌ సంక్రమించించింది.

వనస్థలిపురంలో అధికారుల పర్యటన
వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమానాయక్, ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, కార్పొరేటర్‌ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, ఏసీపీ జయరాం తదితరులు కాలనీని సందర్శించారు. కాలనీలో కొంతమేర రెడ్‌ జోన్‌గా ప్రకటించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. (కేసుల్లో దాపరికం లేదు: ఈటల)

ప్రైవేటు ఆసుపత్రి తీరుపై సర్వత్రా విమర్శలు
వనస్థలిపురంలోని జీవన్‌సాయి ప్రైవేటు ఆసుపత్రి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నూనె వ్యాపారికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికి అధికారులకు తెలపకుండా డబ్బులకోసం వైద్యం చేసిన ఆసుపత్రి తీరును వారు దుయ్యబడుతున్నారు. కరోనా బాధితుడి నుంచి అతడి సోదరుడి కుటుంబంలోని అందరికీ కరోనా వైరస్‌ సోకడం.. సోదరుడి తండ్రి చనిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా కిరాణా, పాల వ్యాపారం నిర్వహిస్తున్న కరోనా బాధితుడి సోదరుడి నుంచి బయటి వారికి ఎవరికైనా కరోనా సోకిందా అనే దానిపై వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆరా తీస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ: అంతు చిక్కని వైరస్‌.. మూలాలు ఎక్కడ?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top