రోహింగ్యాల వేటలో తెలంగాణ పోలీసులు

Hyderabad Police Search For Rohingya Who Participated In Markaz - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఢిల్లీలోని నిజాముద్దీన్ జరిగిన మత ప్రార్థనలలో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతోపాటు రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేంద్రం హెచ్చరికలతో హైదరాబాద్ పరిధిలోని రోహింగ్యాల వివరాలను రాష్ట్ర పోలీసులు సేకరిస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో దాదాపు 6040 మంది రోహింగ్యాల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 వేల మంది రోహింగ్యాలు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1000 మంది.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది రోహింగ్యాలు ఉన్నట్లు నివేదికలో తేలింది. వీరిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్, హరియాణాలోని మేవాట్‌లో జరిగిన మత ప్రార్థనలలో పాల్గొన్నారని  కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. (ఆ రోహింగ్యాలు ఎక్కడ?)

ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటోన్న రోహింగ్యాల ఆచూకీని గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్యాంపు నుంచి వెళ్లిన రోహింగ్యాల కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్న రోహింగ్యాలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మర్కజ్ యాత్రకు ఎవరైనా వెళ్ళారా? వారు మళ్లీ తిరిగి వచ్చారా?అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారుంటే స్వచ్చందంగా వైద్య పరీక్షలు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా స్వచ్చందంగా బయటకు రాకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top