32 కాదు.. 28 దంతాలే..

Hyderabad City In Third Place For Dental Cancer - Sakshi

నోటికి వ్యాయామం లేక కానరాని జ్ఞానదంతాలు

సాక్షి, హైదరాబాద్‌: చిన్నతనంలో పాలదంతాలు వస్తాయి. 7–9 సంవత్సరాల మధ్యలో ఇవి ఊడిపోయి.. పైన, కింద కలిపి కొత్తగా 28 దంతాలు ఏర్పడతాయి. కానీ బాల్యంలో ఆహారాన్ని ఎక్కువగా నమిలే అలవాటు లేకపోవడం, ఐస్‌క్రీమ్స్, చాక్లెట్లు ఎక్కువ తినడం వల్ల నోటికి సరైన వ్యాయామం ఉండటం లేదు. దీంతో దవడలు కుం చించుకుపోతున్నాయి. ఫలితంగా అమ్మాయిల్లో 16 ఏళ్లు, అబ్బాయిల్లో 18 ఏళ్లు దాటాక పుట్టుకొచ్చే నాలుగు జ్ఞానదంతాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. నేటితరం యువతీ యువకుల్లో 90 శాతం మందికి జ్ఞానదంతాలు లేవు.

ఒకవేళ ఉన్నా.. అవి ఎగుడుదిగుడుగా, చిగుళ్లలోకి చొచ్చుకుపోయి ఉన్నాయి. పిల్లల దవడ సైజు తగ్గడమే ఇందుకు కారణం. గ్రామీణ ప్రాంత యువతతో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుతున్న యువతలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. జ్ఞానదంతాలు సరిగా ఏర్పడని వారు ఆహారం తీసుకునేప్పుడు ఆ దంతాలు చిగుళ్లకు గుచ్చుకుని తీవ్రమైన పంటి, తల నొప్పి కలుగుతున్నాయి. ప్రస్తుతం యువతలో వెలుగుచూస్తున్న ఈ సమస్యలకు ఇదే కారణమని సర్వేలో తేల్చారు.

మన దంత ఆరోగ్యం అంతంతే!
►విదేశీయులు విధిగా రోజుకు రెండుసార్లు దంతా లు శుభ్రం చేసుకుంటారు. ఇది వారి దినచర్యలో ఒక భాగం. మన దేశంలో నూటికి 90 శాతం మందికి దంత ఆరోగ్యంపై అవగాహన లేదు.
►ఇట్టే కరిగిపోయే చాక్లెట్లు, స్వీట్లు వంటి పదార్థాలను ఎక్కువ తీసుకోవడం, రాత్రి పడుకునే ముందు దంతాలు శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోట్లో వివిధ రకాల బ్యాక్టీరియా ఏర్పడుతోంది.
►15 నుంచి 30 ఏళ్ల యువతలో 30 – 40% మంది నోటి నుంచి దుర్వాసనతో బాధపడుతుంటే, 60 నుంచి 70 శాతం మంది చిగుళ్ల సమస్యలతో బాధపడుతున్నారు.
►ఆహారాన్ని నమలకుండా మింగడం వల్ల నోట్లో ఊరే లాలాజలం ఉత్పత్తి శాతం తగ్గిపోతోంది. దీంతో ‘హెచ్‌పైలోరే’ అనే బ్యాక్టీరియా కడుపులోకి చేరి అజీర్తి, అల్సర్లకు కారణమవుతోంది.

ఏం చేయాలి?
►ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగాలి. దీనివల్ల దవడల పరిమాణం పెరుగుతుంది. జ్ఞానదంతాల పుట్టుకకు వీలవుతుంది.
►గట్టిగా ఉన్న కాయలు, పండ్లు, గింజలు మెత్తగా నమలడం వల్ల పంటికి ఎక్సర్‌సైజ్‌ అవుతుంది. నోటిలో లాలాజలం సమృద్ధిగా ఉత్పత్తి అవుతుంది. ఆహారం త్వరగా జీర్ణం కావడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
►రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకుంటే దంత ఆరోగ్యం మెరుగవుతుంది.

దంత కేన్సర్‌లో సిటీది మూడో స్థానం
ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే దంత కేన్సర్‌ ఎక్కువ. పొగాకు, జర్దా, పాన్, గుట్కాలు ఎక్కువగా నమలడమే ఇందుకు కారణం. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్, బిహార్‌ ఒకటి, రెండో స్థానాల్లో ఉంటే, హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలుస్తోంది. కోల్‌కతా, చెన్నై, బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పొగాకు ఉత్పత్తులు వాడుతున్న వారిలో 38 శాతం మంది నోటి కేన్సర్‌తో, 28 శాతం మంది నోటి చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. మనతో పోలిస్తే దంత ఆరోగ్యంపై కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర వాసుల్లో అవగాహన ఎక్కువ. – డాక్టర్‌ బి.చంద్రకాంత్‌రావు, దంత వైద్యనిపుణుడు, మహావీర్‌ హాస్పిటల్, మాసబ్‌ట్యాంక్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top