ఆకలి కేకలు | Hunger cry | Sakshi
Sakshi News home page

ఆకలి కేకలు

Jun 28 2014 11:43 PM | Updated on Sep 2 2017 9:31 AM

ఆకలి కేకలు

ఆకలి కేకలు

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి మండల స్థాయి అధికారులు బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే నారాయణఖేడ్ గిరిజన బాలికల వసతి గృహంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.

వారంతా గిరిజన విద్యార్థులు... వసతి గృహాలకు వెళితే...కడుపుమాడకుండా..నాలుగు అక్షరాలు నేర్చుకోవచ్చని ఆశపడ్డారు...తల్లిదండ్రులను వదిలి నారాయణఖేడ్ గిరిజన వసతి గృహానికి వచ్చేశారు. కానీ అమ్మాలా చూడాల్సిన హాస్టల్ వారితో ఆకలి కేకలు పెట్టిస్తోంది. నిర్వాహకులు పెట్టే పురుగుల అన్నం తినలేక కడుపు మాడ్చుకోలేక విద్యార్థులు నరకయాతన అనుభవించారు. ఒకరోజు, రెండు రోజులు కాదు.. రోజూ ఇదే పరిస్థితి తలెత్తడంతో శనివారం తల్లిదండ్రులను హాస్టల్‌కు పిలిపించుకుని తమ కడుపుమంటల గురించి కన్నీటిపర్యంతమయ్యారు. ఇక్కడుండడం తమ వల్ల కాదంటూ తల్లిదండ్రలతో పాటు ఇంటిబాట పట్టారు.
 
 నారాయణఖేడ్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి మండల స్థాయి అధికారులు బడి బాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే నారాయణఖేడ్ గిరిజన బాలికల వసతి గృహంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సిబ్బంది చర్యల కారణంగా బాలికలు ఇంటి బాట పట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
 
 ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వారం రోజుల నుంచి ఈ హాస్టల్ విద్యార్థినులకు సిబ్బంది పురుగుల అన్నం వడ్డిస్తున్నారు. ఆ భోజనం తినలేక బాలికలు కడుపు మాడ్చుకుంటున్నారు. భోజనంలో పురుగులు ఎక్కువగా ఉండడంతో అన్నాన్ని పారేస్తున్నారు. సిబ్బందిలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులను వసతిగృహానికి పిలిపించుకొని పరిస్థితి వివరిస్తున్నారు. చాలా మంది ఇంటికి వస్తామని తల్లిదండ్రుల వెంట పడుతున్నారు.
 
 ఇంత జరుగుతున్నా హాస్టల్ అధికారుల్లో మాత్రం చలనం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు భోజన విషయాన్ని హాస్టల్ సిబ్బందిని ప్రశ్నిస్తే బియ్యం మార్చుతామని తాపీగా సమాధానం చెబుతున్నారు.
 నారాయణఖేడ్ గిరిజన బాలికల వసతిగృహంలో 190 మంది బాలికలు ఉన్నారు. వీరు పట్టణంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. అయితే హాస్టల్ సిబ్బంది మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. జూన్ 12న హాస్టల్ ప్రారంభమైంది. గత ఏడాది సరఫరా చేసిన బియ్యం మగ్గిపోయాయి. ఆ బియ్యానికి పురుగులు పట్టాయి. వాటిని శుభ్రం చేయకుండా అలాగే వంట చేస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 కేవీపీఎస్ నాయకుల
  ఫిర్యాదుతో విచారణ
 ఖేడ్ ఎస్టీ హాస్టల్‌లో పురుగుల అన్నం పెడుతున్నారనే సమాచారం తెలుసుకున్న కేవీపీఎస్ నాయకుడు నర్సింలు శనివారం తహశీల్దార్ రాణా ప్రతాప్ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన హాస్టల్‌కు చేరుకొని వార్డెన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
 
 పురుగుల అన్నం పిల్లలకు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం వచ్చిన బియ్యాన్ని పౌరసరఫరాల గోదాంకు తరలించాలని సూచించారు. కొత్త బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. సిబ్బంది తీరును సంగారెడ్డి ఆర్డీఓ మధుకర్ రెడ్డికి వివరిస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement