బంగారు షాపులో భారీ చోరీ

Huge Theft at a Gold Shop in Nizamabad District - Sakshi

433 గ్రాముల బంగారం, 45 కిలోల వెండి అపహరణ

రూ.30 లక్షలకు పైగా విలువైన సొత్తు మాయం

కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు

రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు

పిట్లం (జుక్కల్‌): పిట్లం మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. బస్టాండ్‌ ప్రాంతంలో గల లక్ష్మీ ప్రసన్న బంగారు దుకాణంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడి, సుమారు రూ.30 లక్షలకు పైగా విలువైన సొత్తును దోచుకెళ్లారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే రహదారి సమీపంలో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. పిట్లం గ్రామానికి చెందిన అవుసుల సుదర్శన్‌ చారి తన ఇద్దరు కుమారులతో కలిసి రెండేళ్లుగా బస్టాండ్‌ ఎదుట లక్ష్మీప్రసన్న జువెలరీ షాప్‌ నిర్వహిస్తున్నాడు.

రోజూ మాదిరిగానే బుధవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి వెళ్లారు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో దుకాణం పక్కనే చాయ్‌ హోటల్‌ నిర్వహిస్తున్న రసూల్‌ తన హోటల్‌ వెనుక భాగం కిటికి తెరిచి ఉండటంతో పాటు బంగారు దుకాణానికి కన్నం వేసినట్లు గమనించి సుదర్శన్‌ కుమారుడు సంతోష్‌కు సమాచారమిచ్చాడు. హుటాహుటిన సంతోష్‌ షాప్‌కు వచ్చి షెట్టర్‌ తెరిచి చూడగా, లోపల సామగ్రి చిందరవందరగా కనిపించాయి. షాప్‌లోని బంగారు, వెండి ఆభరణాలు మాయమవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

దొంగతనం జరిగిన ప్రాంతాన్ని అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య, బాన్సువాడ డీఎస్పీ యాదగిరి, బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు, బిచ్కుంద సీఐ నవీన్, ఎస్సైలు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. దొంగతనం చేయడంలో నైపుణ్యం ఉన్న వారే ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో దొంగతనం జరగడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

షాప్‌లో ఉంచిన 433 గ్రాముల బంగారం, సుమారు 45 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య వెల్లడించారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును సవాల్‌గా తీసుకుంటున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే నైపుణ్యం ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చన్నారు. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ మస్తాన్‌ అలీ, పిట్లం, నిజాంసాగర్, పెద్దకొడప్‌గల్, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్‌ ఎస్సైలు సుధాకర్, సాయన్న, నవీన్‌కుమార్, అభిలాష్, కృష్ణ, సాజిద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top