
నిందితురాలి నుంచి 14తులాల బంగారం స్వాదీనం
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈ నెల 21న రాత్రి జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు ఒక మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి 14తులాల బంగారం స్వా«దీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వెల్లడించారు. ఆదివారం ఉదయం పోలీసులు సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో తనిఖీలు చేస్తుండగా ఖమ్మం పరిధిలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద అనుమానాస్పదంగా కనిపించింది.
ఆమె బ్యాగును తనిఖీ చేయగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఆభరణాలు అమ్మేందుకు హైదరాబాద్‌కు వెళ్తూ హైటెక్‌బస్టాండ్‌లో పట్టుబడింది. ఆమెను స్టేషన్‌కు తరలించి విచారించగా బంగారం షాపులో దొంగతనం చేసిన నిందితులకు ఆశ్రయం ఇచ్చి చోరీకి సహకరించినట్టు అంగీకరించింది. దొంగలించిన బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్‌కు తీసుకెళ్లి అమ్ముదామని దొంగలు నిర్ణయించారు.
ఈమేరకు నిందితులకు ఆశ్రయం ఇచ్చి సహకరించిన అమర్ బట్, మేకల యశోద ఖర్చులకు కొన్ని బంగారు ఆభరణాలు ఇచ్చి మిగతా ఐదుగురు నిందితులు నేపాల్‌కు వెళ్లిపోతున్నట్లు వారికి చెప్పారు. నిందితురాలు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు.
నిందితులంతా ఖమ్మంలో దొంగతనాలు చేసి దొరికిపోయారని, అక్కడ చోరీ చేసే మళ్లీ దొరికిపోతామని, సూర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారన్నారు. ఈ కేసులో జ్యువెలరీ షాపు యజమాని రెండున్నర కిలోల బంగారం, కొంత నగదు దొంగతనానికి గురైనట్టు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సీఐ వెంకటయ్య, ఎస్‌ఐ శివతేజ తదితరులు పాల్గొన్నారు.