యాదాద్రి..భక్తజన సందడి | Huge Devotees In Yadadri Srilakshminarasimha Swamy Temple | Sakshi
Sakshi News home page

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Nov 25 2019 11:40 AM | Updated on Nov 25 2019 11:40 AM

Huge Devotees In Yadadri Srilakshminarasimha Swamy Temple - Sakshi

ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ధర్మదర్శనం, ప్రసాద విక్రయశాల క్యూలైన్లు, ఆలయ పరిసరాలు, ఘాట్‌ రోడ్డు భక్తులతో నిండిపోయాయి. యాదగిరిగుట్ట పట్టణంలో సైతం ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. సెలవుదినం కావడం, కార్తీకమాసం ముగుస్తుండడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించి, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 40వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
–యాదగిరికొండ(ఆలేరు)

సాక్షి,యాదగిరికొండ (భువనగిరి):యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది.  సెలవు దినం, కార్తీకమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయంలోని వివిధ విభాగాల క్యూలైన్లు, కొండపై పరిసరాలు, ఘాట్‌ రోడ్డు కాలు పెట్టడానికి వీలులేకుండా భక్తులుతో నిండిపోయాయి. రూ.150 క్యూలైన్లు నిండి భక్తులు బయటకు బారులుదీరారు.ప్రసా§ద విక్రయశాల క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు.  హోటల్, దుకాణాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సుమారు 40 వేల  మంది  భక్తులు   స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనానికి 6 నుంచి 7గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 

ఉదయం నుంచే భక్తుల రాక మొదలు
కార్తీకమాసం ముగుస్తుండడం సెలవుదినం కూడా కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో భక్తులు కాలినడకన, ఆటోల్లో కొండపైకి చేరుకున్నారు.  ద్విచక్ర వాహనాలు రెండో ఘాట్‌రోడ్డు మూలమలుపు వరకు పార్కింగ్‌ చేశారు. కొండకింద పార్కింగ్, టెంపుల్‌ సిటీ ఘాట్‌రోడ్డు పూర్తిగా కార్లతో నిండిపోయింది. కొండ కింద చెక్‌పోస్టు వద్ద ఘాట్‌రోడ్డు  ప్రారంభంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడడంతో  సీఐలు ఆంజనేయులు, నరసింహారావు తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని చక్కదిద్దారు.  అయినా భక్తులు స్వామి దర్శనం అనంతరం చెక్‌పోస్టు నుంచి బస్టాండ్‌ చేరుకోవడానికి 45 నిమిషాల సమయం పట్టిందని తెలిపారు.

 
సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరిస్తున్న భక్తులు

భక్తులకు తప్పని తిప్పలు
భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో సరైన వసతులు లేక ఇబ్బందులకు గురయ్యారు. అభివృద్ధి పనులు జరుగుతున్న దృష్ట్యా కొండపై స్థలం లేకపోవడంతో  కూర్చొని సేదదీరడానికి సైతం భక్తులు అవస్థలు పడ్డారు. ఇదే అదనుగా దుకాణాదారులు వస్తువులను అధిక ధరలకు విక్రయించారు. కూల్‌ డ్రింక్స్, వాటర్‌ బాటిళ్లను సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. కొబ్బరికాయలను సైతం దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు విక్రయించారు. 

విశేష పూజలు
బాలాలయంలో స్వామి, అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం సుదర్శన హోమం, మూలమంత్రాలతో హవనం, అనంతరం స్వామి, అమ్మవారికి నిత్యకల్యాణం నిర్వహించారు.అలాగే భక్తులు స్వామివారికి సువర్ణ పుష్పార్చన గావించారు. కార్యక్రమంలో  ప్రధానార్చకులు కారంపూడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, గట్టు యాదగరిస్వామి, మంగళగిరి నరసింహామూర్తి,  అధికారులు మేడి శివకుమార్,  వేముల వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమకూరిన ఆదాయం
యాదాద్రి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్క రోజే రూ.13.50 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. నిత్య పూజలు, టికెట్ల ద్వారా వచ్చిన రూ.4.40లక్షలు,  సత్యనారాయణవ్రతాల ద్వారా రూ.9.10లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement