‘వెల్‌నెస్‌’... వెయిటింగ్‌ ప్లస్‌!

Huge crowd came to the wellness centers

సెంటర్లలోని రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్ల వద్ద తప్పని తిప్పలు

సగం మందులతో సరిపెడుతున్న వైనం

మెడికల్‌ రిపోర్టులున్నా.. రిఫర్‌ చేయని వైద్యులు

గతంతో పోలిస్తే భారీగా పెరిగిన ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌ ఓపీ..

సాక్షి, హైదరాబాద్‌: పెన్షనర్లు, ఉద్యోగులు, పాత్రికేయుల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వెల్‌నెస్‌ సెంటర్‌లకు రోగులు పోటెత్తుతున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఖైరతాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్‌కు పది మాసాల క్రితం రోజూ సగటు ఓపీ 30–50 ఉండగా, ప్రస్తుతం 1,700 దాటింది. వనస్థలిపురం ఓపీ రోజుకు సగటున 500–600 మంది వస్తున్నారు. ఖైరతాబాద్‌ సెంటర్‌లో ఇప్పటి వరకు 1.60 లక్షల మంది రోగులకు చికిత్స అందించగా, వనస్థలిపురంలో 70 వేల మంది చికిత్స పొందారు. రోగుల నిష్పత్తికి తగినన్ని రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్లు లేకపోవడంతో నిరీక్షణ తప్పడం లేదు. ఏమీ తినకుండా వైద్య పరీక్షల కోసం సెంటర్‌కు చేరుకున్న వృద్ధులు, మధుమేహగ్రస్తులు, బీపీ బాధితులు గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి రావడం వల్ల స్పృహ తప్పి పడిపోతున్నారు.

వృద్ధులకు తప్పని నిరీక్షణ
రాష్ట్రవ్యాప్తంగా 52 వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత డిసెంబర్‌లో ఖైరతాబాద్‌ ఆరోగ్య కేంద్రంలో వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఇటీవల వనస్థలిపురంలో ఏరియా ఆస్పత్రిలోనూ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఖైరతాబాద్‌లో మొత్తం 21 విభాగాల్లో వైద్యసేవలు అందిస్తోంది. అయితే రోగుల నిష్పత్తికి తగినన్ని మందులు, ఫార్మసీ కౌంటర్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం 8 గంటలకు సెంటర్‌కు చేరుకుంటే మధ్యాహ్నం 2 గంటలవుతోంది. అంతేకాదు వైద్యుడు రాసిన మందుల్లో సగమే ఇస్తున్నారు. ముఖ్యంగా కేన్సర్, హృద్రోగులు, మూత్రపిండాల బాధితులు, కాలేయ బాధితులకు సంబంధించిన లైఫ్‌ సేవింగ్‌ మందుల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. ఇదిలా ఉంటే అప్పటికే ఇతర ఆస్పత్రుల్లో చూపించుకుని ఇన్‌పేషెంట్‌ అడ్మిట్‌ కోసం వచ్చిన రోగుల వద్ద వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు అన్నీ ఉన్నా.. మా కోర్సు పూర్తయిన తర్వాతే అడ్మిట్‌కు అనుమతి ఇస్తామని చెబుతుండటం కొసమెరుపు.

మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలి
రోగుల నిష్పత్తికి తగినన్ని సెంటర్లు లేవు. దీంతో ఉన్నవాటిపై భారం పడుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకుని పాతబస్తీ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, సికింద్రాబాద్‌ ఏరియాలతో పాటు జిల్లా కేంద్రాల్లోనూ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
– రత్నం, భారత్‌ పెన్షనర్ల సంఘం కార్యదర్శి

4 గంటలు వెయిట్‌ చేయాల్సి వచ్చింది
కొంతకాలంగా నడుమునొప్పితో బాధపడుతున్నా. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్‌కు చేరుకున్నా. గంటన్నర తర్వాత ఓపీ చీటీ తీసుకుని వైద్యుడి వద్దకు వెళ్లా. మందులు తీసుకు నేందుకు ఫార్మసీ కౌంటర్‌ వద్ద 3 గంటలు నిలబడాల్సి వచ్చింది. అది కూడా సగం మందులే ఇచ్చారు.     
– సరోజిని, నల్లగొండ

ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం
గతంతో పోలిస్తే ఖైరతాబాద్, వనస్థలిపురం వెల్‌నెస్‌ సెంటర్లకు రోగుల తాకిడి పెరిగింది. రోగుల నిష్పత్తికి సరిపడా సాంకేతిక పరికరాలు, మానవ వనరులు లేకపోవడంతో స్వల్ప ఇబ్బం దులు ఎదురవుతున్న మాట వాస్తవమే. వచ్చిన వాళ్లకు సత్వరమే వైద్యసేవలు అందిస్తున్నాం. అత్యవసర రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నాం.
– డాక్టర్‌ పద్మ,సీఈఓ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top