సొంతింటి కల.. నెరవేరిన వేళ

house dream come true - Sakshi

ఎల్లపెల్లిలో ‘డబుల్‌ బెడ్‌ రూం’ ఇళ్లు ప్రారంభం 

వచ్చే మార్చిలోగా అన్ని ఇళ్లు పూర్తి చేస్తాం : మంత్రి ఐకే రెడ్డి 

నిర్మల్‌రూరల్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలోనే తొలి మోడల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మల్‌రూరల్‌ మండలంలోని తన సొంత ఊరైన ఎల్లపెల్లిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. 45మంది లబ్ధిదారుల ఇళ్లను స్వయానా ప్రారంభించి అందించారు. 125 గజాల స్థలాన్ని ఒక్కో ఇంటికి కేటాయించి 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇంటిని నిర్మించారు. ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షల(రూ. 5.04 లక్షలు ఇంటినిర్మాణానికి, రూ.లక్షా 25వేలు మౌలిక సదుపాయాల కోసం) ఖర్చు చేశారు. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఎనిమిది నెలల స్వల్ప కాలవ్యవధిలోనే 45 ఇళ్ల నిర్మాణం పూరైంది. గ్రామ సభ ద్వారా 45నిరుపేద కుటుంబాలను లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారికి ఇళ్లను అందజేశారు. ప్రతీ ఇంటికి రెండు పడక గదులు, హాల్, కిచన్‌తో పాటు ప్రత్యేకంగా వాషింగ్‌ ఏరియా, కామన్‌ బాత్‌రూంతో పాటు పడక గదికి అటాచ్డ్‌ బాత్‌రూంను కూడా నిర్మించారు. 
సొంతింటి కల నెరవేరుస్తాం: మంత్రి 
జిల్లాలో ప్రతీ నిరుపేద ‘సొంతింటి’ కల నెరవేరుస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎల్లపెల్లిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష 70వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు.

ఈ నిర్మాణాల కోసం ఇసుకను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు సిమెంట్, స్టీల్‌ను కూడా మార్కెట్‌ రేటు కంటే తక్కువ రేటుకు అందిస్తున్నామన్నారు. షేర్‌వాల్‌ టెక్నాలజీతో త్వరితగతిన డబుల్‌ ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ టెక్నాలజీతో కేవలం పది రోజుల్లోగా 10 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పూర్తి చేయవచ్చనన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే వాటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఓర్వలేని తనంతో విమర్శలు చేస్తున్నాయన్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఎల్లపెల్లి మొదటి ‘డబుల్‌ మోడల్‌ కాలనీ’ అని పేర్కొన్నారు.  

గేటెడ్‌ కమ్యూనిటీ తలపించేలా : కలెక్టర్‌ 
ఎల్లపెల్లిలో లబ్ధిదారులకు అందజేసిన డబుల్‌ ఇళ్లు గేటెడ్‌ కమ్యూనిటీని తలపించేలా ఉందని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ చిత్రారామచంద్రన్, జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభారాణి, మంత్రి సతీమణి విజయలక్ష్మి, గృహనిర్మాణ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ సత్యమూర్తి, మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్, సారంగాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు దేవేందర్‌రెడ్డి, రాజ్‌ మహ్మద్, ఎంపీపీ దౌలాన్‌బీ, భూదాత సంపత్‌రెడ్డి, కాంట్రాక్టర్‌ లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీధర్‌రెడ్డి, సర్పంచ్‌ పిట్ల భీంరావు, ఎఫ్‌సీఎస్‌ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు గౌతమ్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

కలలో కూడా ఊహించలేదు.. 
ఇసుంటి ఇల్లు కట్టుకుంటామని మేము కలలో కూడా ఉహించలేదు. ఇండ్లు చాలా బాగున్నాయి. డబుల్‌ బెడ్‌ రూం, హాల్, కిచన్‌ ఎంతో అందంగా, నాణ్యతతో నిర్మించిఇచ్చారు. ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top