హెచ్‌ఎండీఏ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి బదిలీ 

HMDA Commissioner Janardhan Reddy Transfer - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డిని సాధారణ పరిపాలన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త అధికారిని నియమించేంత వరకు పూర్తి అదనపు బాధ్యతలను మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌కు అప్పగించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న జనార్దన్‌రెడ్డిని ఎన్నికల నిబంధనల్లో భాగంగా గతేడాది ఆగస్టు 23న హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా బదిలీ చేశారు. కార్యనిర్వహణాదక్షుడిగా పేరొందిన ఆయన్ను నీటిపారుదల శాఖలో కీలకమైన పోస్టులో నియమించే అవకాశముందని సమాచారం. జనవరి 14 నుంచి అమెరికా పర్యటనలో ఉన్న జనార్దన్‌రెడ్డి సోమవారం నగరానికి చేరుకున్నారు. 

సీఐడీ ఎస్పీ రామ్మోహన్‌ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ 
తెలంగాణ సీఐడీలో సైబర్‌ క్రైమ్‌ ఎస్పీగా పనిచేస్తున్న రామ్మోహన్‌ సోమ వారం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ ఆయ్యారు. పోలీస్‌ శాఖ విభజనలో భాగంగా రామ్మోహన్‌ ఏపీకి ఆప్షన్‌ ఇచ్చారు. ఇటీవలే విభజన అధికారికంగా పూర్తికావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రిలీవ్‌ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన అయేషా మీరా హత్య కేసులో అప్పుడు ఫోరెన్సిక్‌ రిపోర్టు ఇచ్చింది రామ్మోహన్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అయేషా మీరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఆ కేసులో కీలకంగా పనిచేసిన అధికారులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top