ఉద్యోగుల కార్పొరేట్ వైద్య ప్యాకేజీ 40% పెంపు! | hike of 40% of Employees Corporate healing! | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కార్పొరేట్ వైద్య ప్యాకేజీ 40% పెంపు!

Sep 21 2016 2:26 AM | Updated on Oct 9 2018 7:52 PM

ఉద్యోగుల కార్పొరేట్ వైద్య ప్యాకేజీ 40% పెంపు! - Sakshi

ఉద్యోగుల కార్పొరేట్ వైద్య ప్యాకేజీ 40% పెంపు!

ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వివిధ వ్యాధులకు ప్రస్తుతమున్న ప్యాకేజీ సొమ్మును 40 శాతం పెంచడానికి...

కార్పొరేట్ ఆసుపత్రుల విన్నపానికి సర్కారు అంగీకారం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వివిధ వ్యాధులకు ప్రస్తుతమున్న ప్యాకేజీ సొమ్మును 40 శాతం పెంచడానికి సర్కారు సుముఖంగా ఉంది. ఆరేడేళ్ల క్రితం వివిధ వ్యాధులకు నిర్ధారించిన ప్యాకేజీ సొమ్ము ప్రస్తుత ధరల ప్రకారం లేదని... కాబట్టి పెంచడమే సరైందని సర్కారు భావించింది. అందుకే పెంపునకు అంగీకారం తెలిపింది. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డులను ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఉద్యోగుల వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చింది. ఆరోగ్య కార్డుల కింద కేవలం ఆరోగ్యశ్రీలోని నెట్‌వర్క్ సహా ఇతర ప్రైవేటు ఆసుపత్రులు మాత్రమే ఉద్యోగులకు వైద్యం చేస్తున్నాయి.

 తమకు గిట్టుబాటు కాదంటూ కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రం ఈ కార్డుల కింద ఉద్యోగులకు వైద్యం చేయడం లేదు. దీంతో ఈ అంశం మొదటి నుంచీ అపరిష్కృతంగానే ఉండిపోయింది. చివరకు ప్యాకేజీ సొమ్మును 40 శాతం వరకు పెంచుతామని ప్రభుత్వం సూచన ప్రాయంగా తెలిపింది. కార్పొరేట్ వైద్యంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఉద్యోగ సంఘాలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగ నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, కారం రవీందర్, జూపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ అంశంపై బుధవారం కూడా మరోసారి సమావేశం కానున్నారు. గురువారం కార్పొరేట్ యాజమాన్యాలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు.
 
దసరా నుంచి అమల్లోకి రావాలి:
దేవీప్రసాద్, గౌరవాధ్యక్షుడు, టీఎన్‌జీవో
కార్పొరేట్ వైద్యం కోసం ఉద్యోగుల తరఫున కొంత సొమ్ము భరిస్తాం. దసరా నుంచి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య కార్డులు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అవకాశం ఉన్నా అన్ని వ్యాధులకు చికిత్సలు అందించడం లేదు.
 
ఉద్యోగుల నుంచి నెలవారీ ప్రీమియం వసూలు
రాష్ట్రంలో 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.4 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారు కుటుంబ సభ్యులతో కలిపి మొత్తంగా 20 లక్షల మందికిపైగా ఆరోగ్య కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతుంటారు. దాదాపు 230 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకు మొదట్లో ఒప్పుకున్నాయి. కానీ తాజాగా 40 శాతం ప్యాకేజీ పెంచాలని కోరుతున్నాయి.

ఇది ప్రభుత్వానికి భారమైతే గెజిటెడ్ ఉద్యోగులు నెలకు రూ. 300, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ. 200 ప్రీమియంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని... ఆ ప్రకారం నెలకు రూ. 75 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తామని ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల ఆరోగ్య భారాన్ని ప్రభుత్వమే భరిస్తుం దని సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో కేసీఆర్ అన్నారని... కాబట్టి ప్రీమియం వసూలుపై సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారోనని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement