నాలుగు ‘హారాల’కు ఓకే!

Haritha Haram Controversy is ended - Sakshi

     6 వరుసలకు పట్టుబట్టిన ఆర్‌అండ్‌బీ 

     2వరుసల మించి కుదరదన్న నిర్వాహకులు 

     సునీల్‌శర్మ జోక్యంతో ముగిసిన వివాదం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో హరితహారం కారణంగా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు–జాతీయ రహదారుల నిర్వాహకుల (కన్షెషనర్ల) మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. రవాణాశాఖ కమిషనర్‌ సునీల్‌శర్మ జోక్యంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. మొదట ఆర్‌అండ్‌బీ చెప్పినట్లుగా రోడ్డుకు ఇరువైపులా ఆరు వరుస (3+3)ల్లో కాకుండా.. చివరికి నాలుగు వరుస (2+2)ల్లో మొక్కలు నాటేందుకు కన్షెషనర్లు ముందుకు వచ్చారు. శుక్రవారం సచివాలయంలో సునీల్‌శర్మ వారితో మాట్లాడారు.  

అసలేం జరిగింది? 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారాన్ని తమ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా విజయవంతంగా నిర్వహించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. దీంతో రోడ్లు భవనాల శాఖ ఇందుకోసం దాదాపు రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్క లు నాటే విషయంలో కన్షెషనర్లు–ఆర్‌అండ్‌బీ అధికారుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. రహదారులకు ఇరువైపులా ఆరు వరుసల్లో మొక్కలు నాటేందుకు రోడ్లు భవనాల శాఖ సిద్ధమైంది. రెండు వరుసల వరకైతే తమకు అభ్యంతరం లేదని కన్షెషనర్లు చెప్పారు. దీనిపై మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్షెషనర్లపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. 

సాధ్యం కాదన్న ఎన్‌హెచ్‌ఐఏ అధికారులు.. 
ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య సమాచార మార్పిడి లోపంతోనే వివాదం చెలరేగింది. చివరికి ఈ విషయం మంత్రి తుమ్మల దాకా వెళ్లింది. ఈ విషయంపై నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఐఏ) ప్రతినిధులు ‘సాక్షి’కి స్పష్టతనిచ్చారు. నేషనల్‌ గ్రీన్‌ హైవేస్‌ పాలసీ–2015 నిబంధనల ప్రకారం.. ఆరు వరుసల్లో మొక్కలు నాటడం కుదరదని తెలిపారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న జాతీయ రహదారుల వెడల్పు 60 మీటర్లు, ఇందులో డివైడర్‌ 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇక మిగిలిన రెండువైపులా 27.5 మీటర్ల స్థలం ఎన్‌హెచ్‌ఐఏ ఆధీనంలో ఉంటుంది. ఇందులో 22 మీటర్లు బీటీ రోడ్డు పోగా మిగిలిన 5 మీటర్ల ఖాళీ స్థలం భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుతారు.  ఇపుడు అందుబాటులో ఉన్న స్థలం ప్రకారం.. ఒక వరుస చెట్లను ఇప్పటికే నాటారు. మరో వరసకు అతికష్టమ్మీద మొక్కలు నాటే వీలుంది. ఇక మూడో వరసకు చోటే లేదన్నది కన్షెషనర్ల వాదన. ఒక వేళ నాటినా.. రోడ్డు విస్తరణ సమయంలో వాటి కొట్టేయడానికి అనేక అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 

ఆగస్టు 31 నాటికి పూర్తి.. 
ఎక్కడైనా మొక్కలు ఎండిపోయినా, చనిపోయినా వాటిస్థానంలో కొత్తవి నాటుతామని, మొత్తం మీద ఆగస్టు 31 నాటికి హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. మరోవైపు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి హరితహారంలో భాగంగా నాటిన అనేక మొక్కలను మిషన్‌ భగీరథ కోసం పెకిలించివేశారని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వాపోయారు. మేం చిన్న మొక్క పెకిలించాలన్నా.. అభ్యంతరాలు వ్యక్తం చేసే అటవీశాఖ అధికారులు మిషన్‌ భగీరథ కోసం వేలాది మొక్కలు పెకిలించినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement
Read also in:
Back to Top