చేసిందంతా చేసి అమాయకత్వమా?
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణకు అడుగడుగునా ద్రోహం చేశారని మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ధ్వజమెత్తారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణకు అడుగడుగునా ద్రోహం చేశారని మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ధ్వజమెత్తారు. వెన్నుపోట్లకు, ద్రోహానికి, మాట తప్పడంలో చంద్రబాబుకు డాక్టరే ట్లున్నాయని మండిపడ్డారు. కడుపులో విషం పెట్టుకుని, మొహంపై చిరునవ్వుతో మాట్లాడడం ఆయనకే చెల్లిందన్నారు. ‘‘బాబు చేసేదంతా చేసి అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. సీఎం కాగానే పీపీఏలను రద్దుచేయడం, సీలేరు, కృష్ణపట్నం నుంచి కరెంట్ రాకుండా చేయడం, సంప్రదాయేతర ఇంధనంలో వాటా రాకుండా చేయడం వంటివి తెలంగాణకు ద్రోహం చేయడం కాదా?’’ అని ప్రశ్నించారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపాలంటూ కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని హరీశ్ అన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుదుత్పాదనకు ఉద్దేశించినదేనని, అక్కడ కరెంట్‌ను ఉత్పత్తి చేసి తీరతామన్నారు. తెలంగాణలో కరెంటు సమస్యకు గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల విధానాలే కారణమని ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా సదరన్ గ్రిడ్ నుంచి 2 వేల మెగావాట్లు బుక్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కనీసం నోరెత్తని కాంగ్రెస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విద్యుత్ సమస్యను అధిగమిస్తామని, అవసరమైతే దానిపై అఖిలపక్ష భేటీ పెడతామని చెప్పారు. నల్లగొండలో జరిగిన ఘటనను సీఎం కేసీఆర్ సమర్థించరని, అక్కడో ఏదో జరిగి ఉంటుందని అన్నారు.