
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు.
బనకచర్ల కట్టి తీరతామని నారా లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇంతదాకా స్పందించలేదు. సీఎం, మంత్రులు సహా ఎవరూ ఖండించలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్ మాట్లాడుతున్నారు. మీకు తెలియకుంటే మీ నాన్నను అడిగి తెలుసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ నాన్న చంద్రబాబు ఏడు లేఖలు కేంద్రానికి రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయి. కావాలంటే మీకు అన్ని ఆధారాలు పంపిస్తాం.
కేంద్రం, రేవంత్ బలం చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ ఆటలు సాగనివ్వం. బనకచర్లను అడ్డుకుని తీరతాం అని హరీష్‌రావు హెచ్చరికలు జారీ చేశారు.
