మెట్రో అలర్ట్‌

Guns And Knife Find in Hyderabad Metro Train passengers - Sakshi

మెట్రో స్టేషన్లలోకి మారణాయుధాలు  

పలు స్టేషన్లలో ప్రయాణికుల వద్ద గుర్తింపు  

అప్రమత్తమైన యంత్రాంగం భద్రతపై సిబ్బందికి శిక్షణ  

అందుబాటులోకి ఎం–ట్రైనర్‌ వాహనం

ప్రారంభించిన హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

సాక్షి,సిటీబ్యూరో: మారణాయుధాలు, ప్రాణాంతక వస్తువులు ఇటీవల ఉప్పల్, మలక్‌పేట్, ఎల్బీనగర్‌ సహా పలు మెట్రో స్టేషన్లలో భద్రతా తనిఖీల్లో బయటపడడంతో మెట్రో అధికారులు అలర్ట్‌ అయ్యారు. శత్రుదుర్భేద్యంగా ఉన్న ఈ స్టేషన్లలో ఇటీవల పర్సులో ఇమిడిపోయే కత్తి.. చిన్నారుల ఆటబొమ్మలా కనిపించినా ప్రాణాలు తీసే తుపాకీ.. కుర్రకారును మత్తుతో చిత్తుచేసే హుక్కా గన్‌.. జనం ప్రాణాలను పొట్టనబెట్టుకునే రసాయనాలు.. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే లిక్విడ్స్‌.. డ్రగ్స్‌ వంటివి గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మారణాయుధాలు, మత్తు పదార్థాలను గుర్తించేలా స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణనివ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘మొబైల్‌ ట్రైనర్‌ వ్యాన్‌’గా పిలిచే దీన్ని ఆదివారం బేగంపేట్‌లోని హెచ్‌ఎంఆర్‌ కార్యాలయం వద్ద హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ వాహనాన్ని నేరుగా ఆయా స్టేషన్ల వద్దకు తీసుకెళ్లడంతో పాటు భద్రతా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎక్కడికక్కడే అవగాహన కల్పించే వెసులుబాటు ఉంది. దేశంలో ఇలాంటి ప్రయోగం నగర మెట్రో ప్రాజెక్టులోనే చేపట్టినట్లు ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యాన్‌ ద్వారా భద్రతా సిబ్బందికి హెచ్‌ఎంఆర్‌ఎల్‌ భద్రతా విభాగండీసీపీ బాలకృష్ణ నేతృత్వంలో శిక్షణనివ్వాలని ఆదేశించారు. ఈ వాహనంలో టీవీసెట్స్, సీసీటీవీ కెమెరా, ఫైర్‌ ఎక్విప్‌మెంట్, ఇతర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లున్నాయి. ఇక స్టేషన్లలో భద్రతా విధులు నిర్వహిస్తున్న 900 మంది సిబ్బందికి ఆడియో–వీడియో చిత్రాలు, పీపీటీ ప్రజెంటేషన్లు, పోస్టర్లు, బోర్డ్స్, హ్యాండ్‌బుక్‌ల ద్వారా భద్రతా సమాచారాన్ని, తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. శిక్షణ ప్రక్రియను సైతం నేషనల్‌ కమాండ్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ వాహనంలోని హార్డ్‌డిస్క్‌ అధునాతన జీపీఆర్‌ఎస్‌ సాంకేతికత ఆధారంగా పనిచేయనుంది.

దీంతో ఈ వాహనం ఎక్కడ ఉంది.. ఏయే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తుందన్న అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇటీవలికాలంలో లెదర్‌ పర్సుల్లో ఉన్న కత్తులు, ప్రమాదాలకు ఆస్కారం కల్పించే రసాయనాలు, నిషేధిత డ్రగ్స్‌ను మెట్రో స్టేషన్లలో పలువురు ప్రయాణికుల వద్ద కనుగొనడంతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక మెటల్‌ డిటెక్టర్లు, డీఎఫ్‌ఎండీ స్క్రూటినీ తదితరాలను పకడ్బందీగా నిర్వహించాలని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఆదేశించారు. ఇటీవల మెట్రో స్టేషన్ల వద్ద నిర్వహించిన భద్రతా తనిఖీల్లో పట్టుబడిన మారణాయుధాలపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని హెచ్‌ఎంఆర్‌ భద్రతా సిబ్బందిని ఎన్వీఎస్‌రెడ్డి ఆదేశించారు. ప్రయాణికులతో స్నేహపూర్వక సంబంధాలు నెరుపుతూనే భద్రతను మరింతగా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఆర్‌ అధికారులు డీవీఎస్‌రాజు, లక్ష్మణ్, ఆనంద్‌ మోహన్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీఎన్‌ రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

నెలాఖరున హైటెక్‌ సిటీకి మెట్రో రైళ్లు
అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ(10 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలను ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు హెచ్‌ఎంఆర్‌ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల భద్రతా పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. హైటెక్‌ సిటీకి మెట్రోరైళ్లు కూత పెట్టనుండడంతో ఐటీ, బీపీఓ, కేపీఓ తదితర రంగాల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో చిక్కుకోకుండానే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top