తల్లి రాక కోసం..

Gulf victim Lakshmi Requests govt through WhatsApp - Sakshi

కుటుంబ పోషణకు గల్ఫ్‌ బాటపట్టిన లక్ష్మి 

బంధువుల సంరక్షణలో కుమార్తెలు 

ఇటీవల పెద్ద కూతురుకు ప్రమాదం 

లక్ష్మిని స్వదేశానికి పంపించని యజమాని  

వాట్సప్‌ మెస్సేజ్‌ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్న అభాగ్యురాలు

భర్త వైద్యానికి చేసిన అప్పులు తీర్చేందుకు, కూతుళ్ల పోషణకు ఆ మహిళ గల్ఫ్‌బాట పట్టింది. ఒమన్‌లోని మస్కట్‌లో ఓ ఇంట్లో పనిమనిషిగా విధుల్లో చేరింది.  ఎంతో నమ్మకంగా పనిచేసింది. కూతురు పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన ఆమెను  మళ్లీ రావాలని ఒమన్‌ దేశంలోని యజమాని, యజమానురాలు  ఫోన్‌ చేసి రప్పించుకున్నారు. ఆ నమ్మకస్తులే కఠినాత్ములుగా మారారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కూతురుని చూసివస్తానని, ఇండియాకు పంపించాలని యజమానులను వేడుకున్నా పంపండం లేదు. తల్లి కోసం ఇద్దరు కూతుళ్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

కీసరి శ్రీనివాస్, మానకొండూర్‌ (కరీంనగర్‌ జిల్లా) 
కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండల కేంద్రానికి చెందిన లక్ష్మికి అదే గ్రామానికి చెందిన గుండేటి కనకయ్యతో 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. కనకయ్యకు వ్యవసాయ భూమి ఏమీ లేకపోవడంతో  కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించాడు. కొంత కాలం తర్వాత కనుకయ్యకు కామెర్ల వ్యాధి సోకింది. భర్తను బతికించుకునేందుకు లక్ష్మీ ఎన్నో కష్టాలు పడింది. అప్పులు చేసి  భర్తకు చికిత్స చేయించింది. అయినా కనకయ్య బతకలేదు. 2000 సంవత్సరం నవంబరులో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం ఆమెపై పడింది. గీతాంజలి, శ్రీహరి,  శ్రావణి వారి సంతానం. నాలుగేళ్ల వయస్సులో కుమారుడు శ్రీహరి ప్రమాదవశాత్తు చనిపోయాడు. పెద్ద కూతురు గీతాంజలి ఇంటర్‌ మొదటి సంవత్సరం వరకు చదువుకుంది. ఇదే గ్రామంలోని లక్ష్మి ఆడపడుచు లస్మమ్మకు సంతానం లేకపోవడంతో గీతాంజలి ప్రస్తుతం ఆమె వద్ద ఉంటోంది. రెండవ కూతురు లక్ష్మి అమ్మమ్మ అయిన పోచమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 

బంధువుల సహాయంతో గల్ఫ్‌కు... 
భర్త మరణించడంతో కూతుళ్ల భారం లక్ష్మిపై పడింది. ఈ తరుణంలో ఆమె గల్ఫ్‌కు వెళ్లాలని నిశ్చయించుకుంది. తన దూరపు బంధువుల ద్వారా 2014 సంవత్సరంలో గల్ఫ్‌ బాట పట్టింది. ఒమన్‌ దేశంలోని మస్కట్‌లో ఓ ఇంట్లో పనికి కుదిరింది. పిల్లల చదువుకు, పెళ్లిళ్ల కోసం డబ్బులు పోగుచేసుకుంది. ఈ క్రమంలో పెద్ద కూతురుకు వివాహం నిశ్చయం కావడంతో 2018 మార్చి 1న లక్ష్మి స్వగ్రామానికి వచ్చింది. కూతురుకు అదే నెల 10న వివాహం జరిపించింది. పెళ్లి తర్వాత ఒమన్‌ నుంచి ఫోన్‌ రావడంతో వెళ్లేందుకు మొదట ఆమె నిరాకరించింది. 
పదే పదే ఇంటి యాజమాని, యజమానురాలు ఎంతో నమ్మకంగా పనిచేసినవ్‌ నీవే రావాలని.. వచ్చిన తర్వాత విమాన టికెట్‌ డబ్బులు కూడా ఇస్తామని చెప్పడంతో వారి మాటలను నమ్మి 2018 ఏప్రిల్‌లో లక్ష్మి మళ్లీ ఒమన్‌కు వెళ్లింది. అయితే, అక్కడికి వెళ్లాక మొదటి నెల డబ్బులు కూడా వారు ఇవ్వలేదని లక్ష్మీ చెప్పింది. వెళ్లిన కొన్నాళ్లకే పెద్ద కూతురు గీతాంజలి భర్తతో విడాకులయ్యాయి. ఆమె గల్ఫ్‌లో ఉండగానే గీతాంజలికి లక్ష్మి తల్లిదండ్రులు మరో వివాహం చేశారు.  

కూతురుకు రోడ్డు ప్రమాదం.. 
ఆగస్టు నెలలో పెద్ద కూతురు గీతాంజలికి స్వగ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయాలయ్యాయి. ఈ విషయం లక్ష్మికి తెలియడంతో తల్లడిల్లిపోయింది. తన కూతురుకు యాక్సిడెంట్‌ అయ్యిందని, తాను ఇండియాకు వెళ్లివస్తానని యజమాని, యజమానురాలికి చెప్పింది. దానికి వారు ఒప్పుకోలేదు. ఇండియాకు పంపించడం కుదరదని, ఇక్కడే ఉండాలని తెగేసి చెప్పారు.

వాట్సప్‌ మెస్సేజ్‌ ద్వారా వెలుగులోకి..
తన కూతురు రోడ్డు ప్రమాదంలో గాయపడిందని, తనను ఒమన్‌ దేశం నుంచి యజమాని పంపించడం లేదని రోదిస్తూ ఆమె వాట్సప్‌  ద్వారా వాయిస్‌ మెస్సేజ్‌ పెట్టింది. తనను ఎలాగైనా ఇండియాకు పంపించాలని కోరింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లక్ష్మిని ఇండియాకు పంపించేలా చూడాలని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను కలిసి విన్నవించారు. తల్లి కోసం లక్ష్మి కూతుళ్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

కుటుంబంపై ఆర్థిక భారం
కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త కనుకయ్య ఆనారోగ్యంతో చనిపోవడంతో లక్ష్మిపై కుటుంబ భారం పడింది. భర్తకు వైద్యం కోసం చేసిన అప్పులు, కూతురుకు పెళ్లి ఖర్చులు కలిపి సుమారు రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top