స్వాతంత్య్రోద్యమం నుంచి మద్య నిషేధం దాకా అన్నింటా జయమే
‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు
మహిళల హక్కుల కోసం భవిష్యత్ కార్యాచరణ
అందుకే ఐద్వా జాతీయ మహా సభలు
నేటి నుంచి ఐద్వా 14వ జాతీయ మహాసభలు
సాక్షి, హైదరాబాద్: ‘దేశ అభివృద్ధిలో మహిళా శక్తి పాత్ర కీలకం. శాస్త్ర, సాంకేతిక రంగాలు, ఐటీ, డిఫెన్స్ మొదలైన అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు పాల్గొన్న స్వాతంత్య్రోద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం, మద్య నిషేధ ఉద్యమం..ఇలా మొదలైన ఉద్యమాలన్నీ విజయవంతమయ్యాయి. కానీ ప్రస్తుత పాలకులు మనుధర్మాన్ని మళ్లీ దేశంలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తూ, మహిళల విజయాలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
మహిళలు ఊపిరి ఉన్నంత వరకు తమ హక్కుల కోసం ఉద్యమించాల్సిందే. అందుకే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభల్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం’అని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. హైదరాబాద్‌లో ఆదివారం నుంచి ఈనెల 28 వరకు 14వ ఐద్వా జాతీయ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలను వివరించారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...
ఆరు అంశాలపై జాతీయ సభల్లో చర్చ
దేశంలో పాలకులు అవలంబిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలపై 14వ ఐద్వా జాతీయ మహాసభల్లో చర్చించనున్నాం. మహిళలను తిరిగి మనుధర్మం వైపు తీసుకెళ్లాలనే ఆలోచనతో పాటు సామ్రాజ్యవాదం, శ్రమదోపిడీ, హింస, పట్టణాభివృద్ధి, క్రీడల్లో మహిళల అణిచివేత వంటి ఆరు అంశాలపై జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితిని ఈ సమావేశాల్లో చర్చించి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నాం.
అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వర్కర్లతో పాటు వివిధ శాఖల్లోని స్కీం వర్కర్లకు సుప్రీంకోర్టు నిర్దేశించిన రూ. 26వేల వేతనం ఎక్కడా అమలు కావడం లేదు. మద్యం, డ్రగ్స్, అశ్లీల వెబ్‌సైట్లు పదోతరగతి విద్యార్థిని కూడా చెడగొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కరువైంది. ఐద్వా మహాసభల్లో ఈ ఆరు కర్తవ్యాలపై చర్చించి, యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం.
మహిళలు పాల్గొన్న ప్రతి ఉద్యమం విజయవంతమైంది
రష్యా విప్లవం నుంచి రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాటం, మద్యపాన నిషేధం వరకు మహిళలు పాల్గొన్న ప్రతి ఉద్యమం విజయవంతమైంది. 1950 తరువాతనే మహిళలకు ఓటు హక్కు లభించింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు మొదలు అంగన్‌వాడీలు, స్కీం వర్కర్లకు హక్కుల వరకు అన్నీ పోరాటాలతోనే సాధ్యమయ్యాయి. ఐద్వా మహిళా పోరాటాల్లో ముందుండి సాగుతోంది.
మహిళల హక్కుల కోసం దేశవ్యాప్తంగా పోరాడుతున్న ఐద్వా మైక్రో ఫైనాన్స్, యాప్ లోన్స్, బెట్టింగ్ యాప్‌ల ద్వారా దేశవ్యాప్తంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రమే బ్యాంకుల ద్వారా మహిళలకు రుణాలు ఇచ్చి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. అశ్లీల వెబ్‌సైట్‌లను నిషేధించాలి. మహిళలు, విద్యార్థినుల రక్షణకు ఏం చేయాలనే దానిపై సమగ్ర చట్టం రూపొందించి అమలు చేయాలి.
మహిళల గొప్పతనాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి
విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళల గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలి. ఝాన్సీలక్ష్మి, రాణి రుద్రమ తరహాలో చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి పోరాట చరిత్రలను, విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన మహిళల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి, విద్యాబోధన జరపాలి. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగేలా చట్టాలను అమలు చేయాలి. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే దేశంలో మహిళల హక్కులు సాకారమవుతాయి.
28వరకు జాతీయ మహాసభలు
ఐద్వాకు రాష్ట్రంలో 3.75 లక్షల సభ్యత్వం ఉంది. ఐద్వా సభల కోసం ఇప్పటికే 50వేల కుటుంబాలను కలిశాం. తెలంగాణలో తొలిసారిగా ఐద్వా జాతీయ మహాసభలను నిర్వహిస్తున్నాం. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఐద్వా కీలక నేతలు హాజరవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి భారీ ర్యాలీ ప్రారంభమై 2 గంటలకు ఆర్టీసీ బస్‌భవన్ మైదానానికి చేరుకుంటుంది.
3 గంటలకు భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు ఐద్వా అఖిల భారత ప్యాట్రన్ బృందా కరత్, జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి టీచర్, ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, పుణ్యవతి, సుధా సుందర రామన్ తదితరులు హాజరు కానున్నారు. 26,27,28 తేదీల్లో జాతీయ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయి.


