ఇంట్లోనే ఎందుకుండాలంటే..! | Govt find Corona positive cases infected People If they are at home for 21 days | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే ఎందుకుండాలంటే..!

Mar 26 2020 1:55 AM | Updated on Mar 26 2020 10:41 AM

Govt find Corona positive cases infected People If they are at home for 21 days - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు 21 రోజులు ఇంట్లోనే ఉండాలని, బయటకు రావొద్దని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి, మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన కష్టంగానే ఉండొచ్చు కానీ... మన కోసమే అన్నది మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ 21 రోజుల పాటు కచ్చితంగా ప్రజలు ఇంట్లోనే ఉంటేనే కరోనా పాజిటివ్‌ కేసులను, వారి ద్వారా సోకే అవకాశమున్న వ్యక్తులను గుర్తించే వీలుంటుంది. ఉదాహరణకు ‘ఏ’అనే వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఆయన/ఆమె విదేశాల నుంచి వచ్చారు కనుక(రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులను బట్టి) వారికి వ్యాధి నిర్ధారణ అయింది కాబట్టి వారి విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

వెంటనే వారిని ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తారు. నెగెటివ్‌ రిపోర్టు వచ్చిన తర్వాతే ఇంటికి పంపిస్తారు.  ఏ అనే వ్యక్తి విదేశం నుంచి వచ్చిన తర్వాత ఎవరెవరి(బీ)తో కాంటాక్టు అయ్యాడనేది కూడా గుర్తించడం కష్టమేమీ కాదు. ఎందుకంటే తాను ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎక్కడకు వెళ్లాడు... ఎవరిని కలిశాడు అనేది పాజిటివ్‌ వచ్చిన వ్యక్తే వెల్లడిస్తాడు. కానీ, సీ, డీలతోనే అసలు సమస్య. సీ అంటే.. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఏ గానీ, బీ గానీ సమూహంలోకి వెళ్లి ఉంటే.. ఆ సమూహంలో ఎవరున్నారు... వాళ్లు తాకిన వస్తువులను ఎవరైనా తాకారా.. లేదా నేరుగా వారినే ముట్టుకున్నారా..? తుంపర్ల ద్వారా సోకిందా...? వాళ్లెవరు అనేది గుర్తించడం చాలా కష్టం. 

సామాజిక దూరం పాటించాలి..
ఇక, ‘డీ’ని గుర్తించడం పూర్తిగా అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే సీ.. ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరిని కలిశాడు...ఆ సీ కుటుంబ సభ్యులెవరు? వాళ్లెవరిని కలిశారు... ఇలా డీ గ్రూపులోని వారిని గుర్తించడం అసాధ్యం. అందుకే రానున్న 21 రోజులు అందరూ ఇంటికే పరిమితం అయితే.... కరోనా ఇల్లు దాటి వెళ్లదు. ఎందుకంటే ఈ వైరస్‌ సోకిన తర్వాత 14 రోజులకు ఎలాగూ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అప్పుడు సదరు పాజిటివ్‌ వ్యక్తులు, వారి ఫస్ట్‌ కాంటాక్టులను (ఇంట్లో వ్యక్తులు) గుర్తించడం తేలిక. ఆలస్యంగా ఒకరి ద్వారా ఇంకొకరికి ఈ వైరస్‌ సోకి ఉన్నా బయటపడుతుంది. అప్పుడు కరోనా ఎవరెవరిని సోకిందనేది కచ్చితంగా తేలిపోతుంది. 

మూడు ప్రైవేటు ల్యాబొరేటరీలకు అనుమతి
కోవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రంలో మూడు ప్రైవేటు ల్యాబొరేటరీలకు నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌ పరీక్షించే ల్యాబుల సంఖ్య మొత్తం పదికి చేరుకున్నాయి. ఐసీఎంఆర్‌ తాజాగా అనుమతినిచ్చిన వాటిలో జూబ్లీహిల్స్‌లోని అపోలో, హిమాయత్‌నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్, చెర్లపల్లిలోని వింటా ల్యాబ్‌ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఐపీఎమ్, నిమ్స్, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. దాంతో పాటు సీసీఎంబీలో కూడా పరీక్షలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ల్యాబ్‌లలో ఒక్కోదాంట్లో రోజుకు 120 నమూనాల చొప్పున టెస్టులు చేయవచ్చు. సీసీఎంబీలో 1,000 వరకు నమూనాలను పరీక్షించవచ్చు. దీంతో రాష్ట్రంలో ఒక్కరోజులోనే 1,720 నమూనాలను పరీక్షించవచ్చు. వీటికి తోడు తాజాగా మూడు ప్రైవేటు ల్యాబులకు ఐసీఎంఆర్‌ అనుమతినివ్వడంతో నమూనాలను పరీక్షించే సామర్థ్యం మరింత పెరగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement