మేడం వచ్చారు..

Governor Tamilsai Soundararajan Visit karimnagar Today - Sakshi

నేడు పెద్దపల్లి జిల్లాలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

నంది మేడారం ముస్తాబు  ∙ప్యాకేజీ–6ను సందర్శించనున్న గవర్నర్‌

కరీంనగర్‌లో అరగంట షార్ట్‌ బ్రేక్‌ తరువాత హైదరాబాద్‌ పయనం

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

సాక్షి , కరీంనగర్‌ : రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పర్యటనకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటన అనంతరం మంగళవారం సాయంత్రం రామగుండం ఎన్‌టీపీసీ గెస్ట్‌హౌజ్‌కు చేరుకున్న గవర్నర్‌కు ఘన స్వాగతం లభించింది. ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్‌పీ చైర్మన్‌ పుట్ట మధు, జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన, పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి గవర్నర్‌ అక్కడే బస చేస్తారు. కాగా బుధవారం ఉదయం నుంచి పెద్దపల్లి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రామగుండం, బసంత్‌నగర్, పెద్దపల్లిలో నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 12 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు 6వ ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం చేరుకుంటారు. 

నందిమేడారంలో మధ్యాహ్న భోజనం
మధ్యాహ్నం 12 గంటలకు  నందిమేడారం చేరుకోనున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 2.30 గంటల వరకు అక్కడే గడుపనున్నారు. ఈ సందర్భంగా నంది పంప్‌హౌజ్‌ను సందర్శిస్తారు. గవర్నర్‌ మేడం రాక కోసం నంది మేడారం పంప్‌హౌజ్‌ను సుందరంగా ముస్తాము చేశారు. ధర్మారం– పెద్దపల్లి మెయిన్‌ రోడ్డు గేట్‌ నుంచి టన్నెల్‌ వరకు నిర్మించిన సీసీ రోడ్డును శుభ్రం చేశారు. క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎలాంటి స్క్రాప్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్యాకేజీ 6లోని పంప్‌హౌజ్‌లో గవర్నర్‌కు ప్రాజెక్టు గురించి వివరించేందుకు ప్రెజెంటేషన్‌ మ్యాప్‌లను సిద్ధం చేశారు.


గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు స్వాగతం పలుకుతున్న అధికారులు

టన్నెల్‌ పై భాగంలో హైమాస్ట్‌ బల్బులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అండర్‌గ్రౌండ్‌లోని 7 పంప్‌లను పూలతో అలంకరించారు. సబ్‌స్టేషన్, అక్సెస్‌ టన్నెల్, సర్జిఫూల్‌ల వద్ద పూర్తిస్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు ఈఈ నూనె శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఏఈ ఉపేందర్, నవయుగ కంపెనీ డైరెక్టర్‌ రామారావు, ఏజీ శ్రీనివాస్, డీపీఎం రంగబాబులు దగ్గరుండి పనులు పూర్తి చేయించారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత ఇక్కడే భోజనం పూర్తిచేసి 2.30 గంటలకు హైదరాబాద్‌ పయనమవుతారు. 

కరీంనగర్‌లో స్మాల్‌ బ్రేక్‌ 
నందిమేడారంలో నంది పంపుహౌజ్‌ల సందర్శన అనంతరం 3.15 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కరీంనగర్‌ చేరుకుంటారు. ఎల్‌ఎండీ వద్ద గల ఎస్‌ఆర్‌ఎస్‌పీ గెస్ట్‌హౌజ్‌లో కొద్దిసేపు సేదతీరుతారు. ఈ మేరకు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్‌ఎండీ గెస్ట్‌హౌజ్‌ నుంచి సాయంత్రం 3.45 గంటలకు గవర్నర్‌ హైదరాబాద్‌ బయలు దేరుతారు. 

ఘన స్వాగతం
గోదావరిఖని(రామగుండం): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మంగళవారం రాత్రి రామగుండం ఎన్టీపీసీ చేరుకున్నారు. అన్నారం సరస్వతి బ్యారేజీ సందర్శించిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా గోదావరిబ్రిడ్జిపై నుంచి రామగుండం ఎన్టీపీసీకి వచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన తర్వాత మంథని మీదుగా గోదావరిఖని చేరుకోవాల్సి ఉండగా రోడ్డు సరిగా లేకపోవడంతో గవర్నర్‌ ప్రయాణించే రూట్‌ మార్చారు. అన్నారం బ్యారేజీ పరిశీలించిన తర్వాత చెన్నూరు మండలం సుందరశాల మీదుగా చెన్నూరు, భీమారం, జైపూర్‌ మీదుగా గోదావరిఖని చేరేలా ఏర్పాటు చేశారు. 

నేటి పర్యటన వివరాలు..
♦ ఉదయం 8 గంటలకు: ఎన్టీపీసీ స్పందన క్లబ్‌లో బాలికల కరాటే పోటీల సందర్శన
♦ ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు: గోదావరిఖని శారదానగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కళరీపయట్టు కరాటే ప్రదర్శన
♦ ఉదయం 9.45 నుంచి 10.15 గంటల వరకు: బసంత్‌నగర్‌ రూట్‌లో రామగుండం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్‌ సందర్శన
♦  ఉదయం 10.15 నుంచి 10.30 గంటల వరకు: బసంత్‌నగర్‌లోని ఎస్‌హెచ్‌జీ ఉమెన్స్‌ తయారు చేసిన జ్యూట్‌ బ్యాగుల కేంద్రం సందర్శన
♦ ఉదయం 10.30 నుంచి 10.45 వరకు: మహిళా స్వయం సహాయక బృందాల ఆధ్వర ్యంలో సబల శానిటరీ నాపికిన్స్‌ తయారు కేంద్రం పరిశీలన
♦ ఉదయం 10.45 నుంచి 12 గంటల వరకు: ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి స్వగ్రామం కాసులపల్లి గ్రామంలో స్వచ్చత పరిశీలన
♦ 12 నుంచి 12.30 గంటల వరకు:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ధర్మారం మండలంలోని నందిమేడారం  6వ ప్యాకేజీ ప్రాజెక్టు సందర్శనకు ప్రయాణం
♦ 12.30 నుంచి 1.30 గంటల వరకు: 6వ ప్యాకేజీ పరిశీలన
♦ 1.30 నుంచి 2.30 గంటల వరకు: 6వ ప్యాకేజీ వద్ద భోజన ఏర్పాట్లు
♦ 2.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top