
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గిరిజనుల కోసం తీసుకొచ్చిన జీవో–3ను సుప్రీంకోర్టు కొట్టివేసినందున రివ్యూ పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిందన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్ భవన్‌లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగాలను నూరు శాతం గిరిజనులకే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జీవో–3ను తీసుకొచ్చామని, అయితే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో లాక్‌డౌన్ సమయంలో జీవో నం.3ను ధర్మాసనం కొట్టివేసిందని చెప్పారు.
దీనిపై న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చించామని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో త్వరలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిని పెట్టి రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన జీవో 3 వల్ల గత రెండు దశాబ్దాలుగా షెడ్యూల్డు ప్రాంతాల్లోని గిరిజనులు విద్య, ఉద్యోగ రంగాల్లో కొంత అభివృద్ధి అయ్యారని, ఈ సమయంలో జీవో–3ను కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.