
ఇంత అధ్వానమా!
‘ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పిల్లలు ఎలా చదువుకుంటున్నారు...
‘నేల’బారు చదువులు!
మన ప్రభుత్వ పాఠశాలల్లోని చదువుల తీరుకు నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం. వసతుల మాట దేవుడెరుగు. అక్షరాలు దిద్దుదామంటే పలకలు కూడా లేని దయనీయ పరిస్థితి. దీంతో పిల్లలు నేలపైనే అక్షరాలు రాస్తూ... తమ భవిష్యత్తును వాటిలో చూసుకుంటున్నారు. ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఈ దృశ్యం కనిపించింది.
- ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కరువు
- పరిస్థితులు చూసి అవాక్కయిన సీపీఎం నేత తమ్మినేని
ముషీరాబాద్ : ‘ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పిల్లలు ఎలా చదువుకుంటున్నారు..అసలు ప్రభుత్వం ఈ పాఠశాలలను ఎందుకు పట్టించుకోవడం లేదు’ అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గురువారం ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సందర్భంగా పిల్లలకు పలకలు లేక నేలపైనే ఏబీసీడీలను టీచర్ దిద్దిస్తున్న సంఘటన చూసి ఆయన అవాక్కయ్యారు.
ప్రభుత్వం చాక్‌పీస్‌లు కూడా ఇవ్వకపోవడంతో తామే తీసుకువచ్చి విద్యాభ్యాసం చేయిస్తున్నట్లు టీచర్లు తెలిపారు. ఇక మరుగుదొడ్లు, మూత్రశాలలు చూసి ముక్కుమీద వేలేసుకున్నారు. కొన్ని తరగతి గదులు మట్టికొట్టుకుపోయి కూర్చోవడానికి వీలు లేకుండా ఉన్నాయి.
ఒక బ్లాక్ బోర్డు పై 2013 సంవత్సరం వేసి ఉన్న తేదీని చూసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ తరగతులు జరగడం లేదా అని ప్రశ్నించారు. అనంతరం అదే పాఠశాల ఆవరణలో ఉన్న డిప్యూటీ ఐఓఎస్ ఇంద్రజిత్, డిప్యూటీ ఈవో చిరంజీవిల కార్యాలయాలకు వెళ్లి పరిశీలించారు. ఒక అధికారి కార్యాలయంలో పావురాలు గుడ్లు పెట్టి ఉండటాన్ని చూసి కార్యాలయాలే ఇలా ఉంటే పాఠశాలల పరిస్థితి ఇంకెలా ఉంటుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వం కేజీ టూ పీజీ అంటూ ఆర్భాటాలు చేయకుండా ముందు పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని తమ్మినేని ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
నాణ్యమైన విద్యను అందరికీ అందించాలని, తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని కోరారు. పాఠశాలల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని పేర్కొన్నారు. తమ్మినేని వెంట సీపీఎం సెక్రటేరియట్ సభ్యులు డీజీ నర్సింహారావు, సెంట్రల్ సిటీ సెక్రెటరీ ఎం.శ్రీనివాస్, ముషీరాబాద్ జోన్ కార్యదర్శి దశరథ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నాగేశ్వర్‌రావు, జావేద్, వాణి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.