గొర్రెల రీసైక్లింగ్‌పై కదిలిన ప్రభుత్వం

Government focus over sheep recycling - Sakshi

 సమగ్ర విచారణకు మంత్రి తలసాని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌/పుల్కల్‌: సబ్సిడీ గొర్రెల రీసైక్లింగ్‌ వ్యవహారంపై ప్రభుత్వం కదిలింది. ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘అటూ ఇటూ అదే గొర్రె, ఎవరు బకరా’శీర్షికన ప్రచురితమైన పరిశోధనాత్మక కథనంపై స్పందించింది. గొర్రెల రీసైక్లింగ్‌ దందాపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ల్లో సమగ్ర విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా వదలబోమని, కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

పశుసంవర్ధక శాఖ వైద్యులు కచ్చితంగా ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా గొర్రె లు కొనుగోలు చేయాలన్నా రు. ఇప్పటివరకు సుమారు 1.23 లక్షల యూనిట్ల గొర్రె లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఇటీవల లబ్ధిదారులకు అందజేసిన గొర్రెల రీసైక్లింగ్‌పై ప్రాథమిక సమాచారం అందడంతో అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అయినా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ విధివిధానాలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్న సమాచారం ఉన్నట్లు పేర్కొన్నారు. 

మామూళ్లు ఇచ్చాకే అమ్ముకున్నాం..
సబ్సిడీ గొర్రెలు అమ్మినట్లు నిర్ధారణ అయితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతుండగా.. లబ్ధిదారులు కూడా అంతే ఘాటుగా స్పందించారు. అధికారులకు మామూళ్లు ఇచ్చిన తర్వాతే గొర్రెలు అమ్ముకున్నామని, తమపై చర్యలు తీసుకునే ముందు ఆ అధికారులపై కేసులు పెట్టాలని అంటున్నారు. ‘‘మేం ఊరికే గొర్రెలు అమ్ముకోలేదు. పది మందిమి కలిసి వేర్వేరు శాఖలకు చెందిన అధికారులకు రూ.60 వేల మామూళ్లు ఇచ్చాం. మాకేమైనా అయితే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అడుగుతాం’’అని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ లబ్ధిదారుడు ‘సాక్షి’తో అన్నాడు. మరోవైపు అధికారులు ఆదివారం పుల్కల్‌ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రాథమిక సమాచారం సేకరించారు. గ్రామాల వారీగా లబ్ధిదారులకు పంపిణీ చేసిన గొర్రెలు ఉన్నాయా? ఎన్ని మృతి చెందాయి? తదితర అంశాలపై వివరాలు సేకరించారు. పుల్కల్‌లో 15 యూనిట్లకుపైగా అమ్మకాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top