పోలింగ్‌ స్లిప్‌ పై గూగుల్‌మ్యాప్‌!

Google Map On Polling Slips - Sakshi

పోల్‌చిట్టీపై సూచికలు, గుర్తులు 

ఓటింగ్‌ పెరిగేలా అధికారుల చర్యలు 

సాక్షి, పెద్దపల్లిఅర్బన్‌:  జిల్లావ్యాప్తంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్దఎత్తున ఓటుహక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసేలా అవగాహన ర్యాలీలు, ఈవీఎం, వీవీప్యాట్‌ల వినియోగంపై వివిధ సంస్థల ద్వారా కార్యక్రమాలు కొనసాగించారు. ఇప్పుడు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు పోలింగ్‌ స్లిప్పులు అందిస్తున్నారు. ఓటుహక్కు వినియోగించుకుంటే కలిగే ప్రయోజనాలు వివరిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీదేవసేన సందేశ పత్రాన్ని ఓటర్లకు అందజేస్తున్నారు. గ్రామాల్లో ఓటుహక్కు వినిచయోగించుకునే వారి సంఖ్య బాగానే ఉన్నా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం పోలింగ్‌ నమోదు కావడంపై అధికారులు ఆలోచనలోపడ్డారు. ఇందులో భాగంగా పోలింగ్‌ స్లిప్పుల్లో కొత్తగా మార్పులు చేపట్టారు. పోలింగ్‌ స్లిప్‌ మీద ఓటరు ఫొటోతో పాటు వెనకాల బూత్‌కు వెళ్లే దారి, చిరునామా, గూగుల్‌మ్యాప్‌ ప్రింట్‌చేశారు. పోలింగ్‌ స్టేషన్‌ నంబర్, పోలింగ్‌ తేదీని ముద్రించారు. తేలికగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకొని ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని 6,17,726 మంది ఓటుహక్కు వినియోగించుకోవడం కోసం 804 పోలింగ్‌ స్టేషన్‌ల వివరాలు గూగుల్‌ మ్యాప్‌తో అనుసంధానం చేశారు. 

పోలింగ్‌శాతం పెరిగేలా.. 
జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాల్లో పోలింగ్‌ శాతం పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే ఎక్కువగా నమోదవుతోంది. చదువుకున్నవారు, మేధావులు, వ్యాపారులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఓటింగ్‌ నమోదవడం అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రచారాన్ని చేపట్టడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2009 ఎన్నికలతో పోల్చుకుంటే 2014లో ఓటింగ్‌ శాతం మెరుగైనప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. స్పందించిన అధికారులు కారణాలను అన్వేషించి కొత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. 
గ్రామాల్లో పెరిగిన ఓటింగ్‌.. 
2009 ఎన్నికల్లో మంథనిలో 2,02,756 ఓటర్లుండగా 1,50,881 ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,25,755 ఓటర్లుండగా 1,59,384 ఓట్లు పోలయ్యాయి. రామగుండంలో 2,04,981 మంది ఓటర్లుండగా 1,19,051 ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో మంథనిలో 2,10,161 ఓటర్లుండగా 1,69,898 ఓట్లు పోలయ్యాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో 2,20,926 ఓటర్లుండగా 1,11,674 ఓట్లు పోలయ్యాయి. రామగుండంలో 2,22,354 మంది ఓటర్లుండగా 1,39,394 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కావడం విశేషం. అంటే 2009లో మంథనిలో 74.40, పెద్దపల్లి 70.60, రామగుండం 58.08, 2009లో మంథనిలో 81.02 పెద్దపల్లి 75.97, రామగుండం 61.91గా నమోదైంది. 

మంథనిలో చైతన్యం.. 
2009, 2014లో జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కంటే మంథని నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్‌ నమోదైంది. మారుమూల ప్రాంతంకావడం, పోలింగ్‌ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉన్నప్పటికీ, మావోయిస్టుల ప్రభావాన్ని సైతం అధిగమించి ఓటింగ్‌లో పాల్గొని మిగితా వారికి ఆదర్శంగా నిలిచారు. 2009లో 74.40 శాతం, 2014లో 81.02 శాతం ఓటింగ్‌ నమోదుచేసి రికార్డు సృష్టించారు. 2009లో 58.08, 2014లో 61.91 శాతం ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా రామగుండం అట్టడుగునా నిలిచింది. 

యూత్‌పై ప్రత్యేక దృష్టి.. 
18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని పోలింగ్‌ బూత్‌కు తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఓటుహక్కు పొందిన వారిపై దృష్టిని కేంద్రీకరించారు. 18 నుంచి 35 ఏళ్ల యువతను పోలింగ్‌ కేంద్రానికి రప్పించేలా టెక్నాలజీ సహాయాన్ని తీసుకుంటున్నారు. గూగుల్‌ సహాయంతో పోలింగ్‌ కేంద్రాలను గుర్తించేందుకు మ్యాప్‌లు ప్రింట్‌చేసి ఆకట్టుకుంటున్నారు. జిల్లాలో 1,64,009 మంది యువత ఓటుహక్కును కలిగి ఉన్నారు. వీరిలో పురుషులు 88,076 మంది కాగా యువతులు 75,933 మంది ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top