ట్విట్టర్‌లో టాప్‌!

GHMC Is Top In Twitter - Sakshi

జీహెచ్‌ఎంసీకి లక్ష దాటిన ఫాలోవర్లు 

ఇతర కార్పొరేషన్లను దాటి దేశంలోనే తొలి స్థానం 

కమిషనర్‌ ఖాతాకు 55 వేల మంది ఫాలోవర్లు  

నగర పౌరులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టులకు ఉన్నత స్థాయిలోని వారూ తమ తప్పును ఒప్పుకోక తప్పని పరిస్థితి. కొద్దినెలల క్రితం శేరిలింగంపల్లి జోన్‌లో పర్యటన సందర్భంగా మేయర్‌ వాహనం నో పార్కింగ్‌ ఏరియాలో ఆపడాన్ని ఫొటో తీసి ట్విట్టర్‌లో ఉంచారు. దీంతో ఆయన చలానా చెల్లించారు.

ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కారు వేగంగా ప్రయాణం చేసినందుకు ట్రాఫిక్‌ విభాగం జారీ చేసిన చలాన్లు పెండింగ్‌లో ఉండటం ట్విట్టర్‌లో హల్‌చల్‌ సృష్టించింది. దీంతో కమిషనర్‌ చలానా సొమ్ము చెల్లించడంతోపాటు ఇకపై వేగంగా నడపొద్దంటూ డ్రైవర్లను హెచ్చరించారు.

సాక్షి, హైదరాబాద్‌: ఇలా వివిధ సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి నగరవాసులు ట్విట్టర్‌ను ప్రధాన వేదికగా చేసుకుంటున్నారు. దేశంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న సంస్థల్లో జీహెచ్‌ఎంసీ తొలి స్థానంలో ఉంది. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (ఈఓడీబీ)లో భాగంగా జీహెచ్‌ఎంసీ ఈ–ఆఫీస్‌ను అమల్లోకి తెచ్చింది. అలాగే భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, బర్త్‌ సర్టిఫికెట్లనూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తోంది. ఇక ఫిర్యాదుల కోసం ‘మైజీహెచ్‌ఎంసీ’యాప్‌ను అందుబాటులోకి తెచ్చి.. ట్విట్టర్‌ అకౌంట్‌ను ప్రారంభించింది. జీహెచ్‌ఎంసీతో పాటు మేయర్, కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఆయా విభాగాధిపతులకు సైతం ట్విట్టర్‌ ఖాతాలున్నాయి. జీహెచ్‌ఎంసీకి వివిధ మాధ్యమాలతోపాటు ట్విట్టర్‌ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నవారు లక్ష మంది కంటే ఎక్కువే ఉండటం గమనార్హం. తమ ఈ ఫిర్యాదులను జీహెచ్‌ఎంసీ అకౌంట్‌తోపాటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మేయర్‌ రామ్మోహన్, మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ల ఖాతాలకు కూడా పోస్ట్‌ చేస్తున్నారు. ఫిర్యాదు ఎప్పుడు పోస్ట్‌ చేసిన తేదీ, సమయంతో సహా తెలుస్తుండటంతో అధికారులు వీలైనంత త్వరగా స్పందించి.. పరిష్కరిస్తున్నారు. దేశంలోని మిగతా నగరాల కంటే జీహెచ్‌ఎంసీని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నవారే ఎక్కువ. నగరంలోని ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చిచూసినా, జీహెచ్‌ఎంసీనే ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. కాగా, కార్పొరేషన్‌ ఫేస్‌బుక్‌ను ఫాలో అవుతున్నవారు 47,087 మంది ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.  

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో భాగంగా ట్విట్టర్‌తోపాటు జీహెచ్‌ఎంసీ ఫేస్‌బుక్, మైజీహెచ్‌ఎంసీ యాప్, ఈ–మెయిల్స్, ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులతోపాటు నేరుగా నాకందే వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. 
– దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌  

బెంగళూర్, పుణే తదితర నగరాల కంటే జీహెచ్‌ఎంసీకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం అభినందనీయం. ఎక్కువ మంది సోషల్‌ మీడియాను వాడుతుండటమే కాక సమస్యల పరిష్కారానికి కూడా వినియోగించుకుంటున్నారు. 
– అరవింద్‌కుమార్, మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top