బతుకమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధం | GHMC Ready For Bathukamma Saree Distribution | Sakshi
Sakshi News home page

తీరొక్క రంగుల్లో..!

Sep 9 2019 10:24 AM | Updated on Sep 9 2019 10:24 AM

GHMC Ready For Bathukamma Saree Distribution - Sakshi

ఆహార భద్రత కార్డుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక

సాక్షి, సిటీబ్యూరో:  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి అధికార యంత్రాగం సిద్ధమైంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఆహార భద్రత కార్డుల ఆధారంగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి జీహెచ్‌ఎంసీకి అందించింది. తీరొక్క రంగులతో కూడిన బతుకమ్మ చీరలను అందజేయనున్నారు. ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాల్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలను అర్హులుగా గుర్తిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని అర్బన్‌  పరిధిలో సుమారు 20 లక్షల మంది మహిళలను లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు. జాబితాలో నమోదు కాని అర్హులు ఎవరైనా ఉంటే వారికి సైతం చీరలు అందించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నెల 28 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారం రోజుల ముందే చీరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

సర్కిల్‌ వారీగా..
నగరంలో సర్కిల్‌ వారీగా బతుకమ్మ చీరలను కేటాయిస్తున్నారు. ఒక చీర 5.5 మీటర్లు, జాకెట్‌ 80 సెంటీమీటర్ల చొప్పున చీరలు తయారు చేశారు. తయారైన చీరలు, జాకెట్‌ స్టాక్‌ సైతం నగరంలోని గోదాములకు చేరుకుంది. వాటిని నగరంలోని మలక్‌పేట, యాకుత్‌పురా, చార్మినార్, నాంపల్లి, మెహిదీపట్నం, అంబర్‌పేట, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్, సరూర్‌నగర్, బాలానగర్, ఉప్పల్‌ పౌరసరఫరాల సర్కిళ్ల వారీగా  కేటాయించారు. సర్కిల్‌లోని ఎంపికచేసిన ప్రాంతాల్లో చౌకధరల దుకాణాలకు సెంట్రల్‌  పాయింట్‌గా పంపిణీ కేంద్రాలను  ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం పంపిణీ చేసిన కేంద్రాల్లోనే ఈసారి కూడా బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుంది. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తారు. చీరల పంపిణీలో వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యమిస్తారు. లబ్ధిదారులకు ఏరోజు పంపిణీ చేస్తారో స్లిప్‌ల ద్వారా ముందస్తుగా తెలియజేస్తారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement