దుర్గంధమయంగా హుస్సేన్‌సాగర్‌ | GHMC Neglect on Hussain Sagar Cleansing | Sakshi
Sakshi News home page

సాగరళం

Jun 11 2019 10:07 AM | Updated on Jun 14 2019 11:03 AM

GHMC Neglect on Hussain Sagar Cleansing - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక హుస్సేన్‌సాగర్‌ కంపు కొడుతోంది. నెక్లెస్‌ రోడ్‌లో సేదతీరేందుకు వచ్చే సందర్శకులకు దుర్గంధం స్వాగతం పలుకుతోంది. దీంతో కొందరు తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం తదితర సమస్యలతో బాధపడుతుండగా... మరికొందరు కళ్ల మంటలు, చర్మంపై దురద రావడం లాంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఘన వ్యర్థాలు, గుర్రపు డెక్కతో నిండిన సాగర జలాల్లోని బ్యాక్టీరియా.. కూకట్‌పల్లి, బాలానగర్‌ నాలా నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక రసాయన జలాల్లోని సల్ఫేట్‌ను గ్రహిస్తుండడంతో రసాయనిక చర్య జరిగి దుర్గంధం వెలువడుతుండడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం జలాశయం నీటిలో కరిగిన ఆక్సిజన్‌ శాతం సున్నాకు చేరుకోవడం ఆందోళనకలిగిస్తోంది.

ఇక హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలన్న సర్కార్‌ సంకల్పం అటకెక్కింది. ఆర్భాటంగా ప్రారంభించిన ‘మిషన్‌’ గాడి తప్పింది. దశాబ్ద కాలంగా సాగర్‌ ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. సాగర జలాల్లో ఆక్సిజన్‌ శాతం పెంచేందుకు  రెండేళ్ల క్రితం కెనడాకు చెందిన ఎజాక్స్‌ కంపెనీ చేసిన ప్రయోగం సైతం విఫలమవడం గమనార్హం. ప్రక్షాళన పనుల్లో ఇప్పటి వరకు పూర్తయ్యింది గోరంతే. మిగిలిన పనుల పూర్తి అడుగుకో తడబాటులా మారింది. కాగా కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తి చేసినట్లు ప్రకటించినప్పటికీ... ఈ నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దశాబ్దాలుగా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లిన గరళాన్ని తన గర్భంలో దాచుకున్న జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిది కాళ్ల ఎక్స్‌కావేటర్‌ను వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని... చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పీవీ జ్ఞానభూమి నుంచి కిమ్స్‌ ఆస్పత్రి మార్గంలో సాగరజలాల్లో ఘన వ్యర్థాలు గుట్టలుగా పోగుపడడం ప్రస్తుత సాగర్‌ దుస్థితికి అద్దం పడుతోంది.  

‘మిషన్‌ హుస్సేన్‌సాగర్‌’లోచేపట్టాల్సిన పనులివీ...  
జలాశయం నీటి నాణ్యత మెరుగుపరచడం, జలాశయంలోకి ఘన వ్యర్థాలు చేరకుండా చర్యలు.  
దశాబ్దాలుగా జలాశయం అడుగున బెడ్‌లా ఏర్పడిన ఘన వ్యర్థాలను డ్రెడ్జింగ్‌ ప్రక్రియ ద్వారా తొలగించడం.
నాలుగు నాలాల నుంచి చేరుతున్న మురుగు నీటిని దారి మళ్లించడం.
జలాశయం, దాని పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం.  
జలాశయం నీటిని ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్‌అవసరాలకు వాడుకునే స్థాయిలో నీటి నాణ్యతను మెరుగుపరచాలి.  
హుస్సేన్‌సాగర్‌ వద్దనున్న 20 ఎంఎల్‌డీ ఎస్టీపీ ఆధునికీకరణ, సామర్థ్యం పెంపు.
హుస్సేన్‌సాగర్‌ చుట్టూ రింగ్‌సీవర్‌ మెయిన్స్‌ నిర్మించి మురుగునీరు జలాశయంలో చేరకుండా చూడడం.
శుద్ధి చేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు.
జలాశయంలో ఆక్సిజన్‌ శాతం పెంచేందుకు ఏరియేషన్‌ వ్యవస్థ ఏర్పాటు.

సాగర మథనం సాగుతోందిలా..
ప్రధానంగా కలుస్తోన్న నాలాలు: కూకట్‌పల్లి, పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాలు.  
ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు.  
2014: రూ.56 కోట్లతో కూకట్‌పల్లి నాలా డైవర్షన్‌ పనులు.  
2015: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్‌కావేటర్‌తో వ్యర్థాల తొలగింపు.
2017: హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్‌ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్‌ కంపెనీ శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగం ఉచితంగానే చేశారు)
హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు దశాబ్ద కాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు.  

బయో రెమిడియేషన్‌తో సత్ఫలితాలు  
బయో రెమిడియేషన్‌తో హుస్సేన్‌సాగర్‌లో ఆర్గానిక్‌ వ్యర్థాలు, దుర్వాసన తొలగించేందుకు హెచ్‌ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. బెంగళూర్‌కు చెందిన నాకాఫ్‌ సంస్థ ఈ పనులు చేపట్టింది. ప్రధానంగా ఈ సంస్థ పర్యావరణహితమైన బ్యాక్టీరియా, ఇతర సాంకేతిక విజ్ఞానంతో సాగర్‌ను శుద్ధి చేస్తోంది. ఈ బ్యాక్టీరియాతో నీటిలో దుర్వాసనతో పాటు ఈ–కోలి, పాథోజెనిక్‌ బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు సాగర్‌లో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (సీఓడీ), బయోలాజికల్‌ ఆక్సిజన్‌ (బీఓడీ) డిమాండ్, కరిగిన ఘన వ్యర్థాలు(టీడీఎస్‌), కరిగిన రేణువులు (టీఎస్‌ఎస్‌), నీటిలో కరిగిన ఆక్సిజన్‌ శాతాన్ని పీసీబీ ప్రమాణాల మేరకు ఉండేలా చూస్తున్నాయి.      – అర్వింద్‌ కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement