పెద్దపల్లిఅర్బన్: జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పాలనాయంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా తుది ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించింది. జిల్లా మొత్తం 6,12,859 మంది ఓటర్లతో కొత్త జాబితా ప్రచురణ చేస్తున్నారు. ఏడాది కాలంగా సుదీర్ఘ కసరత్తు చేసిన ఎన్నికల అధికారులు చివరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తుది జాబితాను విడుదల చేశారు. అక్టోబర్ 9న చివరి జాబితా ప్రకటించాల్సి ఉండగా, ఓటు నమోదు చేసుకోవడానికి వీలుగా నవంబర్ 19 వరకు గడువును పొడగించారు. అంతేకాదు జిల్లాలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అధికారులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. గత నెలతో పోలిస్తే ఏకంగా 11,523 ఓటర్లు పెరిగారు. అన్ని నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. గత నెల 12న ప్రకటించిన జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 6,01,336 ఉంది.
రామగుండంలో అత్యధికం..
జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. రామగుండం నియోజకవర్గంలో 6,103 మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. ఇందులో పురుష ఓటర్లు 3,149 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2,951 మంది కొత్తగా జాబితాలో చేరారు. పెద్దపల్లిలో పురుషులు 1,044, మహిళా ఓటర్లు 1,250 మంది, మంథని లో పురుష ఓటర్లు 1,445 మంది, మహిళా ఓటర్లు 1,693 తుది జాబితాలో అవకాశం పొందారు.
పురుషులే అత్యధికం..
కొత్త ఓటరు జాబితాలో పురుçష ఓటర్లు అత్యధికంగా ఓటుహక్కు పొంది ఆ«ధిక్యంలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3,03,748 మంది మహిళా ఓటర్లు ఉండగా, 3,09,049 పురుష ఓటర్లు నమోదయ్యారు. నియోజవర్గాలవారీగా చూస్తే రామగుండంలో 95,902 పురుషులు, 91,346 మహిళలు, మంథనిలో 1,02,434 మంది పురుషులు, 1,02,553 మంది మహిళలు, పెద్దపల్లిలో 1,10,713 మంది పురుషులు, 1,09,849 మంది మహిళా ఓటర్లు జాబితాలో ఉన్నారు.
ఓటర్ల కోసం ప్రత్యేక శిబిరాలు..
2014 ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో దాదాపు 60వేల పైచిలుకు ఓట్లు తక్కువగా నమోదయ్యాయి. దీంతో అధికారులు పెద్ద ఎత్తున ప్రత్యేక శిబిరాలను, అవగాహన కార్యక్రమాలను చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేశారు. దీంతో ప్రస్తుత ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. పోలింగ్ బూతుల్లో బీఎల్‌వోలకు టార్గెట్‌లు నిర్దేశించి మరీ పనిచేయించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను నమోదు చేయించడం కలిసివచ్చింది.


