గాంధీలో నో సేఫ్టీ! | Gandhi Hospital No Safety From Fire Accident in Hyderabad | Sakshi
Sakshi News home page

గాంధీలో నో సేఫ్టీ!

Oct 23 2019 11:14 AM | Updated on Oct 30 2019 1:39 PM

Gandhi Hospital No Safety From Fire Accident in Hyderabad - Sakshi

గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఫైర్‌ సేఫ్టీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇక్కడ ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది అంతస్తుల్లో నిర్మించిన ఇన్‌ పేషెంట్‌ వార్డు భవనంలో అగ్ని ప్రమాదం జరిగితే బయటకు వెళ్లే దారి లేదు. ఫైర్‌సేఫ్టీ అంతకన్నా లేదు. ఎల్బీనగర్‌ షైన్‌ ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంతోనైనా ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు కళ్లు తెరవకుంటే భారీ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌ 8 వ తేదీన గాంధీ పిడియాట్రిక్‌ సర్జరీ ప్రిపరేషన్‌ వార్డులో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు వార్డులో చిన్నారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు ఇంక్యుబేటర్లు, ఆరు మానిటర్లు, ఏసీలు, పడకలతోపాటు అధునాతన వైద్యయంత్రాలు కాలిపోయాయి. సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లింది. 

గాంధీ ఆస్పత్రిలో పనిచేయని  ఫైర్‌సేఫ్టీ పరికరాలు 
డిజైన్‌ లోపం...
ఎనిమిది అంతస్తులుగా నిర్మించిన ప్రధాన భవనం డిజైన్‌లోనే లోపం ఉన్నట్లు సంబంధిత ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. అగ్నిప్రమాదం వంటి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఆయా వార్డుల నుంచి బయటపడేందుకు వెలుపల వైపుకు తప్పనిసరిగా మెట్లు ఏర్పాటు చేయాలి. అయితే నాలుగు వైపులా బంధించినట్లు ఇన్‌పేషెంట్‌ వార్డు భవనాన్ని నిర్మించారని, ర్యాంపుతోపాటు మూడు చోట్ల మెట్లు ఉన్నప్పటికీ, వాటి దారులన్ని భవనం లోపలికే ఉండడంతో ప్రమాదం జరిగితే బయటపడే అవకాశమే లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అత్యవసర, అవుట్‌ పేషెంట్‌ విభాగ భవనాలకు వెనుకవైపు నుంచి మెట్లదారి ఏర్పాటు చేసినప్పటికీ ఆయా ద్వారాలకు నిత్యం తాళం వేసి ఉండడం గమనార్హం. 

పనిచేయని ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ..
సుమారు 38 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతున్న గాంధీ ఆస్పత్రిలో అగ్నిమాపక రక్షణ వ్యవస్థ పనిచేయడంలేదు. పదహారేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫైర్‌సేఫ్టీ పరికరాలు తుప్పు పట్టి కొన్ని పనికిరాకుండా పోగా, మరికొన్ని దొంగతనానికి గురయ్యాయి. ఫైర్‌ ఎగ్జిస్టింగ్‌ మిషన్‌లు కొన్నిచోట్ల ఉన్నప్పటికీ వాటిని ఎలా వినియోగించాలో తెలియని పరిస్థితి నెలకొంది. అన్ని విభాగాలను కలుపుకుంటే గాంధీఆస్పత్రికి నిత్యం సుమారు 18 నుంచి 20 వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి చోట ఫైర్‌ వ్యవస్థపై నిర్లక్ష్యం వహించడం దారుణం అని చెప్పొచ్చు.

తరుచు అగ్నిప్రమాదాలు...  
గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తరుచు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా వైద్య ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఫైర్‌సేఫ్టీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆస్పత్రి పాలనయంత్రాంగం పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. గడిచిన రెండేళ్లలో సుమారు పది అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 26వ తేదీన అత్యవసర విభాగంలోని టీఎంటీ వార్డులో అగ్నిప్రమాదం జరగడంతో ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్న రోగులతోపాటు వైద్యులు, సహాయకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
గాంధీ ఆస్పత్రిలో అగ్నిమాపక రక్షణ వ్యవస్థ పనిచేయడంలేదని ప్రభుత్వంతోపాటు, వైద్యఉన్నతాధికారులు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లాం. ఫైర్‌ఫైటింగ్‌ సిస్టం, స్మోక్‌ డిటెక్టివ్స్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరాం. త్వరలోనే అగ్నిమాపక రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రమాదాలు జరిగే సమయంలో తక్షణం స్పందించే విధంగా ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులకు శిక్షణ ఇస్తాం.  – శ్రవణ్‌కుమార్, సూపరింటెండెంట్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement