
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా గజానన్ మాల్యా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. రైల్వే రంగంలో వివిధ హోదాల్లో ఆయన కీలకమైన విధులు నిర్వర్తించారు. ఇండియన్ రైల్వే సర్వీస్‌లో మెకానికల్ ఇంజనీర్స్ పూర్తి చేసిన గజానన్ మాల్యా 1979 స్పెషల్ క్లాస్ రైల్వే అప్రంటీస్ బ్యాచ్ అధికారి. ఈ క్రమంలోనే ఆయన జబల్పూర్‌లోని ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థకు డైరెక్టర్‌గా పని చేశారు. అనంతరం దక్షిణమధ్య రైల్వేలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పని చేశారు. రాంచీ డివిజనల్ రైల్వే మేనేజర్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్, రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్‌లో సీనియర్ ప్రొఫెసర్, సదరన్ రైల్వేలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా గజానన్ మాల్యా విధులు నిర్వర్తించారు. దేశ, విదేశాల్లో రైల్వే రంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.