కమీషన్ కోసం రోడ్డెక్కిన మహిళలు | funds not received of IKP women since six years | Sakshi
Sakshi News home page

కమీషన్ కోసం రోడ్డెక్కిన మహిళలు

Nov 18 2014 11:43 PM | Updated on Sep 2 2017 4:41 PM

కమీషన్ కోసం రోడ్డెక్కిన మహిళలు

కమీషన్ కోసం రోడ్డెక్కిన మహిళలు

రైతుల ధాన్యం దళారుల పాలు కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొనుగోళ్ల ప్రక్రియలో...

చిన్నకోడూరు: రైతుల ధాన్యం దళారుల పాలు కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొనుగోళ్ల ప్రక్రియలో అవినీతి చోటుచేసుకుంది.  గ్రామాల్లో రైతుల నుంచి ధాన్యం, మక్కలు కొనుగోలు చేసేందుకు ఇందిర క్రాంతి పథం పర్యవేక్షణలో స్థానిక మహిళా సం ఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆరేళ్ల క్రితం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌లో ప్రారంభమైన కొనుగోలు కేంద్రంలోని మహిళా సంఘాలకు నేటికి  కమీషన్ డబ్బు ఒక్క రూపాయి కూడా రాలేదు.

 ఆరు సంవత్సరాలుగా రబీ, ఖరీఫ్ సీజన్‌లో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన మహిళా సంఘాలకు సర్కార్ నుంచి కమీషన్ అందిన దాఖలాలు లేవు. ఈ విషయంలో ఐకేపీ సిబ్బందికి కమీషన్ వస్తోందన్న సంగతి తెలుసుకున్న గ్రామైక్య సంఘం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇబ్రహీంనగర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామైక్య సంఘం సభ్యులు 2008 సంవత్సరం నుంచి ప్రతి యేటా నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వారి సేవలకు ప్రభుత్వం కమీషన్ రూపంలో నగదు ప్రోత్సాహకాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. అయితే వారికి  తెలియకుండా ఐకేపీ అధికారులు ఈ కమీషన్‌ను గుటుక్కు మనిపిస్తున్నారు. నిజానికి ఈ కమీషన్ వస్తుందనే విషయం మహిళలకు తెలియలేదు. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మహిళలు ఆందోళనకు దిగారు. సుమారు రూ. 30 నుంచి 40 లక్షల వరకు తమకు ధాన్యం అమ్మిన కమీషన్  రాకుండా పోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.   

తమకు న్యాయం చేసే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించా రు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన గ్రామ సీఏ సాయికృష్ణ, ఐకేపీ ఏపీఎం ఆంజనేయులను వారు నిలదీసి, వాగ్వాదానికి దిగారు. రాస్తారోకోతో   భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్ అక్కడికి అక్కడికి వచ్చి ఆందోళనకారులను సముదాయించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో సమస్యను సామరస్యంగా చర్చించుకుందామని చెప్పడంతో వారు రాస్తారోకో విరమించారు.

కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని ఐకేపీ అధికారుల అవినీతిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  2008  నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవడంతో తమకు కమీషన్ అందలేదన్నారు. తమకు అన్యాయం చేసిన వారిని వెంటనే తొలగించాలని  డిమాండ్ చేశారు.  ఈ విషయమై ఏపీఎం ఆంజనేయులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రికార్డులు లేవని, వివరాలను సంగారెడ్డిలోని కార్యాలయంలో పరిశీలించాక సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement