
ఈ ఏడాది 4.63 కోట్ల మెట్రిక్ టన్నులే లక్ష్యం
వరి సాగు విస్తీర్ణం పెరిగినా.. సేకరణ లక్ష్యంలో తగ్గుదల
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి బియ్యం సేకరణ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా కుదించింది. గత సంవత్సరంలో ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఈసారి బియ్యం సేకరణను ఏకంగా 22,00,000 మెట్రిక్ టన్నుల మేర తగ్గించింది. ఈ మేరకు తాజా అంచనాలను కేంద్ర ప్రభుత్వం వెలువరిచింది. 2024–25 సంవత్సరానికిగాను ఖరీఫ్ సీజన్‌లో 4.85 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయం తెల్సిందే.
ఈ సంవత్సరం 4.63 కోట్ల టన్నుల బియ్యాన్ని మాత్రమే సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఇది గత ఏడాది గణాంకాలతో పోలిస్తే 5.8 శాతం తక్కువ. ఇటీవల కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులతో నిర్వహించిన భేటీలో ఈ మేరకు బియ్యం సేకరణ లక్ష్యాలను ఖరారు చేసింది. వాస్తవానికి భారతదేశ వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వర్షాలు అధికంగా పడటంతో రైతులు అధిక దిగుబడి ఆశించి ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు మొదలెట్టారు.
దేశ వ్యాప్తంగా సగటు వరి సాగు విస్తీర్ణం 4.03 కోట్ల హెక్టార్లు మాత్రమే. కానీ ఈ సంవత్సరం అందకు మించిన స్థాయిలో అంటే 4.20 కోట్ల హెక్టార్లలో వరి సాగు మొదలెట్టారు. గత సంవత్సరం కన్నా ఏకంగా 29,60,000 హెక్టార్ల అధిక సాగు జరగడం విశేషం. అయితే విస్తీర్ణం పెరిగినప్పుడు ఆమేరకు దిగుబడి పెరిగే వీలుంది. అందుకు తగ్గట్లు బి య్యం సేకరణ పరిమాణం పెరగాలి. ఆ మేరకు సేకరణ లక్ష్యం పెరగాల్సిందిపోయి గణనీయంగా తగ్గింది.
ఇందుకు కారణాలను ప్రభుత్వ వర్గాలు బయటపెట్టలేదు. వాస్తవానికి భారతదేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గరీజ్ కళ్యాణ్ యోజన సహా వివిధ కేంద్ర ప్రభుత్వ ఆహార పథకాల అమలుకు ఏటా 4.10 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. బఫర్ స్టాక్ కింద మరో 1.02 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అయితే ప్రస్తుతం తమ వద్ద ఇప్పటికే 3.80 కోట్ల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఈ కారణంగానే బియ్యం సేకరణ లక్ష్యాను పెంచుకోవాల్సిందిపోయి తగ్గించినట్లుగా వార్తలొచ్చాయి.