
విజయనగరం జిల్లా ఎస్. కోటలో యూరియా కోసం బారులుదీరిన రైతులు
వరి సాగు వద్దంటూ సీఎం చంద్రబాబు పదేపదే ప్రకటనలు
ఖరీఫ్ సీజన్‌లో 54 శాతం విస్తీర్ణంలో సాగయ్యే పంట వరి
అలాంటి వరిసాగును నిర్వీర్యం చేసేదిశగా క్షేత్రస్థాయిలో కుట్రలు
దీనిలో భాగంగా యూరియా దొరక్కుండా నాటకాలు
ఒకప్పుడు ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణ.. ఆంధ్రప్రదేశ్
బియ్యం ఉత్పత్తిలో టాప్–5లో ఉన్న రాష్ట్రం నేడు 9వ స్థానానికి దిగజారింది
ఇప్పటికే 5.5 లక్షల ఎకరాల మేర తగ్గిన నూనెగింజల సాగు
ప్రస్తుత సీజన్‌లో కాస్త మెరుగ్గా సాగైన పంటలు వరి, మొక్కజొన్నే
వీటిసాగు కూడా తగ్గితే వలసలు భారీగా పెరిగే అవకాశం
సాక్షి, అమరావతి: ‘వరి పంట వేయొద్దు.. వరి పంట వల్ల ఆదాయం లేదు.. ఈ పంట సాగువల్ల రైతులకేమీ మిగలదు..’ ఇటీవల కుప్పంలో సీఎం చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో వరి సాగుచేస్తున్న రైతులను కలవరపెడుతున్నాయి. ఇదే లక్ష్యంతో వరిసాగును నిర్వీర్యం చేసేదిశగా క్షేత్రస్థాయిలో కుట్రలకు పాల్పడుతున్నారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. దీన్లో భాగంగానే.. యూరియా కొరత సృష్టిస్తూ అదునులో అందకుండా చేస్తున్నారని రైతుసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఓవైపు జాతీయస్థాయిలో వరిసాగు పెరుగుతోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లోనే సాధారణ సాగువిస్తీర్ణం కంటే మిన్నగా (107 శాతంలో) వరి సాగయింది. ఏపీలో గత ఏడాది నుంచి వరిసాగు విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా తగ్గిపోతున్నాయి. బియ్యం ఉత్పత్తిలో ఒకప్పుడు టాప్–5లో ఉన్న ఏపీ నేడు 9వ స్థానానికి దిగజారిపోయింది. టాప్–10లో ఉన్న తెలంగాణ నేడు టాప్–2కి ఎగబాకింది. 2024–25 మూడో ముందస్తు దిగుబడి అంచనాలపై కేంద్ర వ్యవసాయశాఖ జారీచేసిన గణాంకాలేæ ఇందుకు నిదర్శనం.
అన్నపూర్ణ పరిస్థితి.. అధోగతి
ఏపీలో ఖరీఫ్ సాధారణ సాగువిస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు. దీంట్లో 36.37 లక్షల ఎకరాల్లో (దాదాపు 54 శాతం విస్తీర్ణంలో) వరి సాగవుతుంది. ఈ సీజన్‌లో సాగులక్ష్యం 86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 55 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దీన్లో 30 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. ఖరీఫ్‌లో కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లోనే అత్యధికంగా వరి సాగవుతుంది. అందుకే ఈ బెల్ట్‌ను దేశానికే అన్నపూర్ణగా పిలుస్తుంటారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు విజయనగరం, రాయలసీమ జిల్లాల్లో సైతం ఈసారి యూరియా కొరత ఎక్కువగా ఉంది.
ప్రస్తుతం చిరుపొట్ట దశలో ఉన్న వరికి అవసరమైన నత్రజని (యూరియా) అందని పరిస్థితి నెలకొంది. ఈ అదునులో పైరుకు నత్రజని ఇవ్వకపోతే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. 2024–25 సీజన్‌లో 80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు రాగా, ఈసారి వరుస వైపరీత్యాలకుతోడు ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏర్పడిన యూరియా కృత్రిమ కొరతతో దిగుబడులు మరింత తగ్గిపోతాయని అంచనా వేస్తున్నారు.
అదునులో రైతును దెబ్బకొడుతున్న కూటమి సర్కారు
ఖరీఫ్ సీజన్‌లో 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 13.52 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక యూరియా వరకు చూస్తే ఈ సీజన్‌లో 6.22 లక్షల టన్నులు అవసరం కాగా.. ఇప్పటికే 5.80 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయంటోంది. సెప్టెంబర్ నెలకు 1.55 లక్షల టన్నుల యూరియా కావాల్సి ఉండగా.. 90 వేలటన్నులు అందుబాటులో ఉన్నట్లు పాలకులు చెబుతున్నారు. అయినా క్షేత్రస్థాయిలో సన్న, చిన్నకారు రైతులకు కట్ట యూరియా కూడా దొరకడంలేదు.
యూరియాకు ప్రత్యామ్నాయం లేదని తెలిసినా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్ మాదిరిగా ఎకరాకు అరకట్టే పరిమితం చేయడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. యూరియా కట్ట ధర రూ.266.50 కాగా, బహిరంగ మార్కెట్‌లో రూ.500 నుంచి రూ.600 వరకు వసూలు చేçస్తున్నారు. ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్తే యూరియా కట్ట కావాలంటే రూ.1,400కు పైగా పలికే కాంప్లెక్స్ ఎరువులను అంటగడుతున్నారు.
మరికొందరు రూ.800 నుంచి రూ.900 మధ్య ఉండే పురుగుమందులు కొంటేనే యూరియా విక్రయిస్తామంటూ మెలిక పెడుతున్నారు. దీంతో యూరియా కోసం రైతులు అవసరం లేని కాంప్లెక్స్ ఎరువులు, పురుగుమందులు కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని రైతులు చెబుతున్నారు.
అధికంగా వినియోగం అంటూ ప్రచారం
ఓవైపు గత సీజన్‌తో పోల్చుకుంటే అదనంగా దాదాపు లక్షటన్నుల యూరియా అమ్మకాలు జరిగాయని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు వరిసాగులో యూరియా మితిమీరి వినియోగించడం వలన ప్రజలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారంటూ భయాందోళనలకు గురిచేస్తోంది.
ఈ సీజన్‌లో ఇప్పటికే దాదాపు ఐదున్నర లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగు తగ్గింది. ఉన్నంతలో కాస్త మెరుగ్గా వరి, మొక్కజొన్న పంటలే సాగయ్యాయి. ఖరీఫ్‌లో మొత్తం సాగువిస్తీర్ణంలో 54 శాతానికిపైగా సాగయ్యే వరికి ప్రత్యామ్నాయం లేదు. కానీ ప్రభుత్వ నిర్వాకం వలన వరిసాగు కూడా తగ్గితే వ్యవసాయ కూలీలతోపాటు రైతులు కూడా పెద్ద ఎత్తున వలసబాట పట్టే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అరకొర ఎరువులు రైతులకు రిక్తహస్తాలు!
ముదినేపల్లి రూరల్, సరుబుజ్జిలి, శృంగవరపుకోట: రాష్ట్రంలో యూరియా దొరక్క కర్షకుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్కారు సక్రమంగా యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతన్నలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండంలోని వడాలి సొసైటీకి గురువారం యూరియా లోడ్ వచ్చింది. వచ్చిన ఎరువులు ఏ మూలకీ చాలలేదు. కొద్దిసేపటికే యూరియా అమ్ముడైపోయింది. దీంతో రైతులు రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొత్తకోట రైతు సేవా కేంద్రానికి సుమారు 1200 ఎకరాల రైతులకు కేవలం 100 ఎరువుల బస్తాలు వచ్చాయి. దీంతో ‘మీరిచ్చే ఒక్క బస్తా ఎందుకూ పనికి రాదు. అలాంటప్పుడు మిగిలిన ఎరువును మీరే బ్లాకులో అమ్ముకోండి’ అంటూ రైతులు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులను అడుగుతుంటే ‘ఎరువులు తక్కువ వేసుకోండి. వృథా చేయవద్దు’ అంటున్నారని, అవసరం ఉంది కాబట్టేగా అడుగుతున్నాం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలోని జె.కి.అగ్రి ఇండియా ట్రేడర్స్ దుకాణంలో యూరియా అమ్ముతున్నారన్న సమాచారంతో పలు గ్రామాల రైతులు ఉదయం నుంచి దుకాణం ముందు బారులు తీరారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా రైతుల మధ్య తోపులాట, స్వల్ప వాదనలు జరగడంతో ఎస్.కోట పోలీసులు బందోబస్తు కోసం వచ్చారు.
ఎవరికి ఇస్తున్నారు యూరియా.. ఉదయం నుంచి ఎన్ని కట్టలు ఇచ్చారంటూ ఓ రైతు నిలదీయడంతో పోలీసులు ‘నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నిన్ను ఎవడ్రా రమ్మన్నాడు. ఎక్కువ మాట్లాడకు’ అంటూ ఆయనపై దుర్భాషలకు దిగారు. ఇది చూసిన రైతులు ‘ఏం కర్మ పట్టిందిరా.. కూటమి ప్రభుత్వంలో రైతుకి దక్కిన గౌరవంఇదీ’ అంటూ నిట్టూర్చారు.
రాష్ట్రంలో యూరియా సరిపడా ఉంది: సీఎస్
రాష్ట్రంలో యూరియా సరిపడా అందుబాటులో ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరతలేదన్నారు. అన్ని రైతుసేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లలో రోజువారీ ప్రారంభ, ముగింపు నిల్వలు ప్రదర్శించాలన్నారు. ఉల్లి, పొగాకు పంటల ఉత్పత్తి, కొనుగోలు.. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర తోడ్పాటుపై కూడా సీఎస్ సమీక్షించారు.
వరిసాగు తగ్గితే ఆహార భద్రతకు పెనుముప్పు
దేశవ్యాప్తంగా వరిసాగు పెరుగుతుంటే.. ఏపీలో తగ్గించాలని చెప్పటం ఆందోళన కలిగిస్తోంది. ఒక మోస్తరు వర్షానికే నీరు నిలువ ఉండే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా, శ్రీకాకుళం జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు? వరిసాగు తగ్గితే భవిష్యత్‌లో ఆహారభద్రతకు పెనుముప్పుగా మారుతుంది. ఖరీఫ్‌లో 54 శాతానికి పైగా విస్తీర్ణంలో సాగయ్యే వరికి ప్రత్యామ్నాయం లేదు.
వరిసాగు తగ్గితే వ్యవసాయ కూలీలతో పాటు కౌలురైతులు కూడా వలస బాటపడతారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు (ఇ2+50%) పెట్టుబడులకు కనీసం 50 శాతం తక్కువ కాకుండా కనీస మద్దతు ధర నిర్ణయించడమే కాదు.. ఆ మేరకు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్