గ‘లీజు’ !  

Full Demands To Nizamabad Color Granite - Sakshi

భీంగల్‌ మండలంలో ఎంతో విలువైన కలర్‌ గ్రానైట్‌ నిల్వలున్నాయి. ఇక్కడే ప్రత్యేకంగా లభించే ఈ గ్రానైట్‌కు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంటుంది. చైనా వంటి దేశాలకు గ్రానైట్‌ ఎగుమతి అవుతుంది. దీంతో మండలంలోని మెండోరా శివారులో గ్రానైట్‌ తవ్వకం లీజు కోసం 2012లో ఓ బడా కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఎన్‌ఓసీ ఇచ్చేందుకు స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు అక్కడ వ్యవసాయ భూములు, పంట పొలాలు దెబ్బతింటాయని, సమీపంలోనే గుడి, పాఠశాల కూడా ఉండటంతో గ్రానైట్‌ తవ్వకానికి వీలు లేదని నివేదిక ఇచ్చింది. దీంతో ఫైల్‌ పెండింగ్‌ పడిపోయింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇదే లీజు కోసం ఆ బడా గ్రానైట్‌ కంపెనీ పావులు కదుపుతోంది. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : గ్రానైట్‌ తవ్వకాల్లో రూ.కోట్లు దండుకోవడానికి అలవాటుపడిన బడా కంపెనీ లీజు కోసం పట్టు వదలని ప్రయత్నం చేస్తోంది. అక్కడ గ్రానైట్‌ తవ్వడానికి వీలు పడదని అధికారులు తేల్చి చెప్పి, నివేదిక ఇచ్చినప్పటికీ., అదే క్వారీ లీజు కోసం ఈ కంపెనీ ఆరేళ్ల తర్వాత కూడా మళ్లీ ప్రయత్నాలు సాగిస్తుండటం భూగర్భ గనుల శాఖలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. రూ.కోట్లు విలువ చేసే కలర్‌ గ్రానైట్‌ను ఎలాగైనా తవ్వుకుని తీసుకెళ్లేందుకు కంపెనీ సామ, ధాన, దండోపాయాలను వినియోగిస్తోంది. జిల్లాలోని భీంగల్‌ మండలంలో ఎంతో విలువైన కలర్‌ గ్రానైట్‌ నిల్వలున్నాయి. కేవలం నిజామాబాద్‌ జిల్లాలోనే ప్రత్యేకంగా లభించే ఈ గ్రానైట్‌కు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంటుంది. చైనా వంటి దేశాలకు గ్రానైట్‌ ఎగుమతి అవుతుంది. ఇప్పటికే జిల్లాలో పలు బడా కంపెనీలు ఏళ్ల తరబడి గ్రానైట్‌ తవ్వకాలు సాగిస్తున్నాయి. వీటికి తోడు మరికొన్ని కంపెనీలు కూడా కొత్త లీజుల కోసం ప్రయత్నాలు చేశాయి. ఇందులో భాగంగా భీంగల్‌ మండలం మెండోరా శివారులో ఉన్న ఓ లీజు కోసం 2012లో ఓ బడా కంపెనీ దరఖాస్తు చేసుకుంది.

దరఖాస్తును పరిశీలించిన భుగర్భ గనుల శాఖ అధికారులు ఎన్‌ఓసీ కోసం రెవెన్యూ అధికారులకు రాశారు. స్థలాన్ని పరిశీలించిన ఆ శాఖ అధికారులు అక్కడ గ్రానైట్‌ తవ్వకాలు జరపడానికి వీలులేదని (ఎఫెక్టెడ్‌) నివేదిక ఇచ్చారు. అలా తవ్వితే చుట్టుపక్కన ఉన్న వ్యవసాయభూములు, పంట పొలాలు దెబ్బతింటాయని నివేదికలో పేర్కొన్నారు. సమీపంలోనే గుడి ఉందని, తద్వారా గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు వస్తాయని తేల్చింది. విద్యార్థులు చదువుకునే పాఠశాల కూడా ఉండటంతో ఇక్కడ తవ్వడం నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. సుమారు ఆరేళ్ల క్రితం నివేదిక ఇవ్వడంతో లీజు మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఇప్పుడు ఇదే లీజు కోసం బడా గ్రానైట్‌ కంపెనీ పావులు కదుపుతోంది. ఎలాగైనా తమకు లీజు మంజూరు చేసేందుకు గల మార్గాలను అన్వేషిస్తోంది.
 
ఆరేళ్ల తర్వాత..
సుమారు ఆరేళ్ల క్రితం తిరస్కరించిన గ్రానైట్‌ లీజు దరఖాస్తు ఫైలును ఆ శాఖ అధికారులు పక్కనబెట్టేశారు. తాజాగా ఈ బడా కంపెనీ లీజు కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో ఫైలుకు కాల్లోచ్చాయి.  కదలిక షురువైంది. గతంలో తిరస్కరించిన లీజును ఎలాగైనా మంజూరు చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదైనా దొడ్డి దారిన లీజు పొందేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. 

 రాజకీయ ఒత్తిడి.. 
ఈ గ్రానైట్‌ లీజు మంజూరు కోసం బడా కంపెనీ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తోంది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతిని«ధి సహాయంతో లీజు పొందేందుకు పెద్ద స్థాయిలో పావులు కదుపుతోంది. మొత్తం మీద స్థానిక గ్రామ ప్రజల జీవనానికి ప్రశ్నార్థకంగా మారే ఈ గ్రానైట్‌ లీజు మంజూరు విషయంలో అధికారులు ఎలా వ్యవహరిస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయమై ‘సాక్షి’ప్రతినిధి భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణను సమాచారం ఇవ్వాలని కోరగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే కార్యాలయం సమాచారం ఇవ్వడం కుదరదని, ఈ విషయంలో తామేమీ మాట్లాడేందుకు వీలు లేదని, ఏదైనా ఉంటే జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని సెలవిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top