స్తంభించిన వైద్య సేవలు | Frozen medical services | Sakshi
Sakshi News home page

స్తంభించిన వైద్య సేవలు

Jun 18 2019 3:10 AM | Updated on Jun 18 2019 3:10 AM

Frozen medical services - Sakshi

ఉస్మానియా ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిపివేయడంతో వెనుతిరుగుతున్న రోగులు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలు స్తంభించాయి. కోల్‌కతాలో వైద్యులపై దాడిని ఖండిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అత్యవసర సేవలు మినహాయించి మిగతా అన్నిరకాల వైద్యసేవలను నిలిపివేశారు. వివిధ విభాగాలకు చెందిన సీనియర్‌ వైద్యనిపుణులు, ప్రొఫెసర్‌లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌లు, జూనియర్‌ డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రుల్లో వివిధ రకాల సేవలు అందజేసే మెడికల్, పారా మెడికల్‌ సిబ్బంది మొత్తం విధులను బహిష్కరించారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉస్మానియా, ఈఎన్‌టీ, గాంధీ, నిమ్స్, నిలోఫర్, కింగ్‌కోఠి, కోఠి ప్రసూతి ఆసుపత్రి, నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, పేట్లబురుజు మెటర్నిటీ ఆసుపత్రి, ఎర్రగడ్డ ఛాతీ దవాఖానా, మానసిక చికిత్సాలయం వంటి ప్రధాన ఆసుపత్రులతోపాటు ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యసేవలను నిలిపివేసి రోడ్లపైకి వచ్చారు.

వైద్యులపై దాడులను అరికట్టాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతాచట్టం తేవాలని నినాదాలు చేశారు. సికింద్రాబాద్‌ సన్‌షైన్, బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్, అమెరికన్‌ ఆంకాలజీ హాస్పిటల్‌ తదితర కార్పొరేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్స్‌ల్లోనూ వైద్యులు విధులను బహిష్కరించి ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించారు. ఔట్‌పేషెంట్‌ విభాగాల సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ రోగులు నిరాశతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. అత్యవసర సేవలను మాత్రం కొనసాగించారు. ప్రాణాపాయస్థితిలో వచ్చిన వారికి వైద్యసేవలను అందజేశారు.  

తలలకు కట్టుతో వినూత్న నిరసన... 
కోల్‌కతాలో వైద్యులపై జరిగిన దాడికి నిరసన తెలిపేందుకు తల, కాళ్లు, చేతులకు కట్లు కట్టుకొని వినూత్న పద్ధతిలో డాక్టర్లు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి కోఠి, సికింద్రాబాద్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. రోగులకు ఎలాంటి బాధలు వచ్చినా నయం చేసేందుకు తాము ఉన్నామని, కానీ తమకు బాధలు వస్తే పట్టించుకొనేవాళ్లు లేరని పలువురు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యుల భద్రతపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు.

గాంధీ ఆసుపత్రిలోని జూనియర్‌ డాక్టర్లు వీధినాటిక ప్రదర్శించారు. సన్‌షైన్‌ ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ గురువారెడ్డి, బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ పీఎస్‌ రావు, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, ఐఎంఏ తెలంగాణ కార్యదర్శి డాక్టర్‌ సంజీవ్‌సింగ్‌ జాదవ్, కోశాధికారి డాక్టర్‌ శివలింగం, తెలంగాణ వైద్యుల సంఘం ప్రతినిధులు డాక్టర్‌ రవిశంకర్, డాక్టర్‌ రవికుమార్, ఉస్మానియా ఆసుపత్రి నుంచి డాక్టర్‌ రఘు, డాక్టర్‌ సిద్దిపేట్‌ రమేష్, డాక్టర్‌ కృష్ణారెడ్డి, తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షులు విజయేందర్‌గౌడ్‌ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement