8 నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు | Sakshi
Sakshi News home page

8 నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు

Published Fri, Jul 3 2015 10:34 PM

from 8th onwards web options

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 8 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. వెబ్ ఆప్షన్లను ముందుగా 6వ తేదీ నుంచే ప్రారంభించాలని భావించినా రెండ్రోజులపాటు వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు. శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అనుబంధ గుర్తింపుపై దాఖలు చేసిన కేసులో నిర్ణయాన్ని రెండ్రోజులు వాయిదా వేయాలంటూ అడ్వొకేట్ జనరల్ చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీల్లో కూడా మార్పు చేశామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఇప్పటికే సుమారు 62,777 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఇంటర్ విద్యార్థులకు కూడా ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. ఒకవేళ వీలు కాకపోతే రెండో దశ కౌన్సెలింగ్‌లో వారిని చేర్చుతామన్నారు. ఇప్పటి వరకు ఇంటర్ బోర్డు నుంచి ఫలితాల వివరాలు తమకు రాలేదని, అవి రాగానే విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తామని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ రమణరావు తెలిపారు.

Advertisement
Advertisement