హలో.. పోలీస్‌ సేవలెలా ఉన్నాయి..?

Friendly Policing In Raikal Police Commissionerate - Sakshi

సాక్షి, రాయికల్‌(జగిత్యాల): ‘హలో.. మేం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీ పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు ఇచ్చారు కదా.. పోలీసులు వెంటనే స్పందించారా. ఒకసారి వెళ్లగానే ఎస్సై, ఎస్‌హెచ్‌వో(స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌) కలిశారా. రెండు, మూడు పర్యాయాలు వెళ్లారా. మీతో పోలీస్‌ అధికారి బాగా మాట్లాడారా. అక్కడ పోలీసులు, ఇతర సిబ్బంది ఇవ్వమని అడిగారా. పోలీస్‌స్టేషన్‌లో మరోసారి పని పడితే ఒక్కరే వెళ్లే ధైర్యం వచ్చిందా’ అంటూ పోలీస్‌ ఉన్నతాధికారులు బాధితులకు ఫోన్‌ కాల్‌ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్‌ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

జగిత్యాల జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి వారం రోజుల వ్యవధిలో బాధితులకు ఫోస్‌ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్‌ వెళ్లినప్పటి నుంచి కేసు నమోదు ప్రక్రియ ముగిసి కేసుకు సంబంధించిన పత్రం ఇచ్చేవరకు జరిగే వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలను ప్రశ్నల రూపంలో అడుగుతున్నారు. పోలీసుల పనితీరుపై పోలీస్‌ ఉన్నతాధికారులు నేరుగా ఫోన్‌ కాల్‌ చేసి ఆరా తీడయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అవినీతి నిర్మూలనే ధ్యేయంగా..
పోలీస్‌ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. గతంలో పోలీస్‌ అధికారులు, సిబ్బందిపై ఉన్న మచ్చలను తొలగించాలనే ఉద్దేశంతో పోలీస్‌ ఉన్నతాధికారులు నేరుగా ప్రజలతో మాట్లాడుతున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. ఒకప్పుడు పోలీస్‌స్టేషన్‌ మెట్లక్కాలంటే భయపడే విధానానికి స్వస్తి పలకాలనే సంకల్పంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసే సమయంలో బాధితుల చరవాణి నంబర్‌ను అంతర్జాలంలో నమోదు చేసేస్తున్నారు. ఆ నంబరుకు కాల్‌ చేసి సేవల తీరును తెలుసుకుంటున్నారు. పోలీసులు సైతం ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. నిందితులు, వారి కుటుంబసభ్యులతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. రిమాండ్, స్టేషన్‌ బెయిల్‌ ఇతర విషయాల్లో నగదు తీసుకుంటున్నారా.. పారదర్శకంగా పని చేస్తున్నారా.. అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ విధానాలతో గతంతో పోలిస్తే జిల్లాలో కిందిస్థాయిలో అవినీతి చాలావరకు తగ్గిందని ఉన్నాతాధికారులు తెలిపారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో పోలీసులు వ్యవహరించే విధానంలో మార్పులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ తీరు ఫలించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీస్‌ సిబ్బంది అధికారులు తమ విధులను పారదర్శకంగా నిర్వర్తిస్తున్నారు. ఒక్కరే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమాలతో పోలీస్‌స్టేషన్లకు సమస్యల పరిష్కారానికి వెళ్లే ప్రజల్లో మనోధైర్యం పెరుగుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top