రవిప్రకాశ్‌ కేసులో తొలగని ఉత్కంఠ

Former CEO of TV9 that does not support inquiry into supreme orders - Sakshi

నేడు న్యాయస్థానం ముందుకు పోలీసులు

సుప్రీం ఆదేశాలు పాటించకుండా విచారణకు సహకరించని టీవీ9 మాజీ సీఈవో

కేసును ప్రభావితం చేసే ధోరణిని వివరించనున్న పోలీసులు

తదుపరి చర్యల కోసం విజ్ఞప్తి.. ఫోర్జరీ చేశానని ఇప్పటికే అంగీకరించిన రవిప్రకాశ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ, నిధుల మళ్లింపు, లోగో విక్రయం తదితర కేసుల్లో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. దర్యాప్తులో సహకరించని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ వైఖరిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి, న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీవీ9కి సంబంధించి అటు హైదరాబాద్, ఇటు సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా పలు సాక్ష్యాలు సంపాదించిన పోలీసులు మరిన్ని ఆధారాల సేకరణలో తలమునకలయ్యారు. ఇప్పటికే ఫోర్జరీ కేసులో సంస్థ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు రవిప్రకాశ్‌ అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు మిగిలిన కేసులపై దృష్టి సారించారు.

ఈ కేసులో శివాజీ– రవిప్రకాశ్‌ మధ్య నడిచిన లావాదేవీలు, పాతతేదీలతో నకిలీపత్రాల సృష్టికి సంబంధించి పలు వివరాలను పోలీసులు సంగ్రహించిన విషయం తెలిసిందే. చానల్‌ నుంచి నిధులను తన సొంత ఖాతాకు బదిలీ చేసిన విషయంలోనూ పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో బంజారాహిల్స్‌ పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా కేసులో కీలకం కానున్నాయి. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను కేవలం రూ.99 వేలకు విక్రయించడంపైనా పోలీసుల సందేహాలు కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే స్వా ధీనం చేసుకున్న పోలీసులు వాటి విశ్వసనీయతపై నిగ్గు తేల్చనున్నారు.

ఈ కేసులో పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు సినీనటుడు శివాజీ తనకు మంచిమిత్రుడని చెప్పిన రవిప్రకాశ్‌.. అతన్ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు మౌనం వహించడం విశేషం. మరోవైపు సైబరాబాద్‌ పోలీసులపైనా రవిప్రకాశ్‌ బెదిరింపులకు దిగడం  గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్‌ విచారణను సాంతం పోలీసులు వీడియోలో చిత్రీకరించారు. రెండు కమిషనరేట్లలో పోలీసులు ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలు సరిపోలేదని అనిపిస్తే.. మరోసారి రవిప్రకాశ్‌ను విచారించే అవకాశాలు ఉన్నాయి.  

న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళతాం..
రవిప్రకాశ్‌ కేసు విషయమై ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌ కుమార్‌ సైబరాబాద్‌ కమిషనరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు ఫిర్యాదులోని అం శాల ఆధారంగా జరుగుతోంది. తదుపరి విచారణ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలను సోమవారం న్యాయస్థానం ముందుంచుతాం. తదుపరి దర్యాప్తు ముందుకుసాగేలా అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తాం.. అని అన్నారు.   

లోపల ఒకలా.. బయట మరోలా..
కేసు సాంతం రవిప్రకాశ్‌ వ్యవహారశైలి వింత గా ఉంటూ వస్తోంది. లోపల విచారణలో ఒకలా.. బయట మీడియాకు మరోలా కనిపిస్తూ.. విచార ణను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారు. లోపల మాత్రం దర్యాప్తునకు సహకరించట్లేదు. కేసు నమోదైనప్పటి నుంచి కోర్టులో పిటిషన్ల విచా రణ జరుగుతున్నపుడు వాటిపై ప్రభావం చూపేలా 9వ తేదీన ఒకసారి, 22న మరోసారి వీడియోలు రిలీజ్‌ చేశాడు. విచారణకు హాజరైనప్పుడు మాత్రం ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు.

పైగా ప్రశ్నావళి రాసిస్తే.. తాను వాటికి సమాధానాలు రాసిస్తాను అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఓ 10 నిమిషాలు ప్రశ్నలు అడిగాక తల టేబుల్‌పై పెట్టుకుని పడుకుంటున్నారు. విచారణ కు సంబంధించిన వీడియో రికార్డింగ్‌ అంతా తనికివ్వాలంటూ పోలీసులను కోరుతున్నారు. 6 నెలల తరువాత అసలు యుద్ధం మొదలుపెడతా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఒక్కటి కూడా పాటించకుండా విచారణకు సహకరించడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top