‘సాగర్‌’ చుట్టూ గాలింపు

Forest Department Circling The Himayat Sagar Pond For Leopard - Sakshi

చిరుత కోసం హిమాయత్‌సాగర్‌ చెరువు చుట్టూ గాలిస్తున్న అధికారులు

మొయినాబాద్‌ (చేవెళ్ల): బుద్వేల్‌ అండర్‌పాస్‌ వద్ద గురువారం కనిపించి ఆ తర్వాత అదృశ్యమైన చిరుత కోసం అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. నాలుగు రోజులు గా చిరుత కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు. ఆదివారం మరోమారు హిమాయత్‌సాగర్‌ జలాశయం చుట్టూ గాలించారు. మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్, నాగి రెడ్డిగూడ, శంషాబాద్‌ మండలంలోని కొత్వాల్‌గూడ, మర్లగూడ, కవ్వగూడ పరిసరాల్లో అటవీ శాఖ అధికారులు అన్వేషించారు. శనివారం ఉదయం హిమాయత్‌సాగర్‌ జలాశయంలో చేపల వేటకు వెళ్లిన అజీజ్‌నగర్‌కు చెందిన వ్యక్తి చిరుతను చూసినట్లు అధికారులకు చెప్పడంతో అక్క డ పరిశీలించారు. చెరువు అంచున పాదముద్రలను పరిశీలించారు. అలాగే, శంషాబాద్‌ మండలం మ ర్లగూడ సమీపంలో రైతులు చిరుత పా దముద్రలు ఉన్నాయని చెప్పడంతో అటవీ శాఖ అధికారులు అక్కడా ప రిశీలించారు. అవి చిరుత పాదము ద్రలు కావని నిర్ధారించుకున్న అధికారులు, అవి ఏ జంతువుకు సంబంధించినవో తెలుసుకునే పనిలో పడ్డారు.

జాగిలాలతో గాలింపు: అటవీ శాఖ అధికారులు చిరుతకోసం ఆదివారం జాగిలాల (డాగ్‌స్క్వాడ్‌)తో గాలింపు చేపట్టారు. కాగా, హిమాయత్‌సాగర్‌ జలాశయం పరిసరాల్లోకి చిరుత వచ్చిందనే ప్రచారంతో సమీప గ్రామాల్లో కలకలం మొదలైంది. చెరువు చుట్టుపక్కల గ్రామాలవాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుతను త్వరగా బంధించాలని కోరుతున్నారు.

భయాందోళన వద్దు.. 
చిరుత హిమాయత్‌సాగర్‌ చెరువు వైపు వచ్చిందని వదంతులు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చినట్లు ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. పరిసర గ్రామాల ప్రజలు ఎవరూ భయాందోళన చెందవద్దు. చిరుత ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే 100కు డయల్‌ చేసి సమాచారం ఇవ్వాలి. – ప్రతిమ, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్, చిలుకూరు మృగవని

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top