తెలంగాణ యువకుడిపై కాల్పులు 

Firing on Telangana Young Man - Sakshi

అమెరికాలో దోపిడీ దొంగల ఘాతుకం..

మహబూబాబాద్‌: అమెరికాలో మరో తెలుగు యువకుడిపై దుండగులు దారుణానికి ఒడిగట్టారు. మహబూబాబాద్‌కు చెందిన పూస సాయికృష్ణ (26) అనే యువకుడిపై కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావంతో డెట్రాయిట్‌లోని ఓ ఆసుపత్రిలో సాయికృష్ణ మృత్యువుతో పోరాడుతున్నారు. జనవరి 4న జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన సాయికృష్ణ.. 2015లో ‘ట్రిపుల్‌–ఈ’లో మాస్టర్స్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. 2016 డిసెంబర్‌ నుంచి మిచిగాన్‌ రాష్ట్రంలో ఐబీఎస్‌ఎస్‌ కన్సల్టింగ్‌ కంపెనీలో ఇన్ఫొటైన్‌మెంట్‌ టెస్ట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. జనవరి మూడు రాత్రి 11.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విధులు నిర్వహించుకుని తిరిగి వస్తున్న సమయంలో అటకాయించిన దొంగలు బలవంతంగా కార్లో ఎక్కి.. కొంతదూరం తీసుకువెళ్లారు. నిర్జన ప్రదేశంలోకి వెళ్లాక సాయికృష్ణ పర్స్‌ లాక్కుని కార్లోంచి తోసేశారు. అనంతరం ఆయనపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో చల్లని చలిలోనే సాయికృష్ణ పడిఉన్నారు. అటుగా వెళ్తున్న కొందరు బాధితుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన సాయికృష్ణకు డెట్రాయిట్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉందని.. నాలుగైదు ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఉందని తెలిసింది. 

షాక్‌లో కుటుంబం 
సాయికృష్ణ తండ్రి పూస ఎల్లయ్యకు జనవరి 4 అర్ధరాత్రి అమెరికాలోని ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ కుమారుడు కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనకు చికిత్స అవసరం. రక్తం ఎక్కించాలి. అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాలి. మీరు అనుమతిస్తే వైద్యం చేస్తాం’అనేది ఫోన్‌ సారాంశం. ఒక్కగానొక్క కుమారుడికి ప్రమాదం జరిగిందన్న సమాచారం ఎల్లయ్య దంపతులను షాక్‌కు గురిచేసింది. తమ కుమారుడి పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడాలని తల్లిదండ్రులు శైలజ, ఎల్లయ్య కోరారు. అసలేం జరిగిందో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సాయిపై కాల్పులు జరిగాయన్న సంగతి అతని తల్లిదండ్రులకు తెలియదు. 

మానవత్వం పరిమళించె.. 
సాయికృష్ణ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినందుకు ఆయనకు ఇన్సూరెన్స్‌ లేదు. దీంతో వైద్య ఖర్చులను (ఇన్సూరెన్స్‌ లేకపోతే అమెరికాలో వైద్యం చాలా ఖరీదు) భరిం చేందుకు సాయి మిత్రులు వినోద్, నాగేందర్‌లు ‘సపోర్ట్‌ సాయికృష్ణ’ఉద్యమాన్ని ప్రారంభిం చారు. ‘గోఫండ్‌మి.కామ్‌’వెబ్‌సైట్‌ ద్వారా 17 గంటల్లోనే 1,06,379 డాలర్లను (దాదాపు రూ.74లక్షలు) సేకరించారు. 2.5 లక్షల డాలర్లు సేకరించడమే తమ లక్ష్యమని వీరు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top